ఎంపీ అరవింద్ బీజేపీ పెద్ద‌ల చేతిలో బుక్క‌య్యాడా?

September 24, 2020

ఇప్ప‌టికే ప‌సుపు బోర్డు ఏర్పాటు విష‌యంలో రైతుల ద‌గ్గ‌ర‌ ఇర‌కాటంలో ప‌డిపోయిన నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అరవింద్ తాజాగా పార్టీ పెద్ద‌ల విష‌యంలోనూ అదే ప‌రిస్థితిని ఎదుర్కునే ప‌రిస్థితి తెర‌మీద‌కు వ‌చ్చింది. ఏకంగా పార్టీ పెద్ద‌ల వ‌ద్దే ఆయ‌నపై ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు చేసింది కూడా బీజేపీ నేత‌లు కావ‌డం గ‌మనార్హం. ప్ర‌స్తుతం హాట్ హాట్‌గా జ‌రుగుతున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెర‌మీద‌కు వ‌చ్చిన టికెట్ల గొడ‌వ‌లో ఈ ఫిర్యాదు జ‌రిగింది.

ఎంపీ అర్వింద్‌పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత యెండల లక్ష్మీనారాయణ వర్గీయులు భగ్గుమంటున్నారు. దాదాపు 200 మంది యెండల వర్గీయులు శనివారం హైదరాబాద్‌ వెళ్లి, అర్వింద్‌పై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఎంపీ అర్వింద్‌, ఆయన అనుచరుడు బస్వ లక్ష్మీనర్సయ్య కలిసి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ, రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎదుట బైఠాయించి, ధర్నా చేశారు. మున్నూరు కాపులకే టికెట్లన్నీ కేటాయించారని, ఆది నుంచి పనిచేస్తున్న తమకు మొండిచేయి చూపారని ఆరోపించారు. లక్ష్మీనర్సయ్యతో కలిసి ఎంపీ అర్వింద్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ సీనియర్లకు కనీసం గౌరవం ఇవ్వడంలేదని ఆగ్రహంతో ఆరోపించారు. కాగా, వీరికి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ స‌ర్దిచెప్పారు.
ఇదిలాఉండ‌గా, ఇప్పటికే అర్వింద్‌ పసుపుబోర్డు ఏర్పాటుతో పార్టీ ప్రతిష్ఠ పోయింద‌ని అసంతృప్తితో ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలకు.. టికె ట్ల కేటాయింపు అంశం తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇటీవల వచ్చిన అర్వింద్‌ తమపై పెత్తనం చేయడమేమిటని భగ్గుమంటున్నారు. దీనికి తోడు తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు పంచాయితీ అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యింది. తాడోపేడో తేల్చుకుందామని అర్వింద్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. యెండల తెరవెనుక వీరికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధిష్ఠానం అర్వింద్‌ను పల్లెత్తుమాట అనలేదు. దీంతో ఇప్పటివరకు ఓపికపట్టిన యెండల.. పార్టీపై ధిక్కారస్వరాన్ని పరోక్షంగా వినిపించారు. ఇది నిజామాబాద్‌ బీజేపీలో తీవ్ర కలకలానికి దారితీసింది.