వ‌ర్మ గారి కొత్త సినిమా ఇదిగో..

September 22, 2020

నిర్భ‌య నిందితుల‌కు ఉరి శిక్ష ప‌దే ప‌దే వాయిదా ప‌డుతుండ‌టంపై చాలా ఫీలైపోయాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఈయ‌నేంటి ఇలాంటి విష‌యం మీద ఫీలైపోతున్నాడ‌ని చాలామంది ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే ఆ ఆవేద‌న వెనుక కార‌ణం వేర‌ని ఇప్పుడ‌ర్థ‌మ‌వుతోంది. వ‌ర్మ సామాజిక అంశాల మీద స్పందించాడంటే దానికి, సినిమాకు ఏదో లింక్ ఉండే ఉంటుంద‌ని మ‌నం అర్థం చేసుకోవాలి. గ‌తంలో ముంబ‌యి దాడులు జ‌రిగిన వెంట‌నే పోలీసుల‌తో క‌లిసి వ‌ర్మ తాజ్ హోట‌ల్‌ను సంద‌ర్శించ‌డం ఎంత వివాదం రేపిందో తెలిసిందే. సినిమాకు ఇన్ పుట్స్ కోస‌మే వ‌ర్మ అక్క‌డికి వెళ్లాడ‌ని మీడియా అనుమానించింది. త‌ర్వాత అదే నిజ‌మైంది. వ‌ర్మ నిర్భ‌య నిందితులకు ఉరి అమ‌లు కాక‌పోవ‌డంపై, అంత‌కుముందు దిశ ఉదంతం ప‌ట్ల‌ ఆక్రోశం వెళ్ల‌గ‌క్క‌డానికి కూడా సినిమానే కార‌ణ‌మ‌ని ఇప్పుడు వెల్ల‌డైంది.
మూడు నెల‌ల కింద‌ట‌ తెలుగు రాష్ట్రాల్ని కుదిపేసిన దిశ ఉదంతం మీద వ‌ర్మ సినిమా తీయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు. బ‌ర్నింగ్ ఇష్యూ ఏం జ‌రిగినా.. దాని మీద సినిమా అనౌన్స్ చేసేయ‌డం వ‌ర్మ‌కు అల‌వాటుగా మారింది గ‌త కొన్నేళ్ల‌లో. ఎక్కువ‌గా వివాదాస్ప‌ద అంశాల్నే క‌థాంశాలుగా తీసుకుని త‌న స్థాయికి ఏమాత్రం త‌గ‌ని విధంగా సినిమాలు తీస్తున్నాడు వ‌ర్మ‌. ఆయ‌న్నుంచి చివ‌ర‌గా వ‌చ్చిన అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు (క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు) ఎంత చీప్‌గా త‌యారైందో, దానికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి ఫ‌లితం వ‌చ్చిందో తెలిసిందే. వ‌ర్మ మీద ఏమాత్రం అంచ‌నాలు, గౌర‌వం ఉన్నా ఆ సినిమాతో పోయే ఉంటాయి. ఇలాంటి టైంలో మ‌రో రాజ‌కీయ చిత్రం తీస్తే జ‌నాలు క‌న్నెత్తి కూడా చూడ‌ర‌ని అర్థ‌మై దిశ ఉదంతం మీద సినిమా తీస్తానంటున్నాడు. దీని గురించి కొత్త‌గా జ‌నాలకు తెలియాల్సిందేమీ లేదు. వ‌ర్మ తీసే నాసిర‌కం సినిమాల త‌ర‌హాలోనే దీన్ని తీసి జ‌నాల మీద రుద్దాల్సిన అవ‌స‌ర‌మైతే ఇప్పుడు లేదు. మ‌రి వ‌ర్మ ఆలోచ‌నేంటో?