బాబుకు షాక్‌... ఎమ్మెల్సీ ప‌ద‌వికి ఆయ‌న గుడ్ బై

September 21, 2020

ఓ వైపు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో...  ప్రజలను మోసం చేసిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇర‌కాటంలో ప‌డేసేందుకు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు క‌స‌ర‌త్తు చేస్తుంటే... అదే స‌మ‌యంలో స‌రిగ్గా అదే పాయింట్‌లో మ‌ళ్లీ చంద్ర‌బాబు ఇర‌కాటంలో ప‌డిపోయారు. తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ త‌న పదవికి రాజీనామా చేశారు. శాసనమండలిలో మూడు రాజ‌ధానుల ఏర్పాటు అంశంపై  టీడీపీ తీర్మాన చర్చకు ముందే టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా రాజీనామా చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు పార్టీ అధ్య‌క్షుడు, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు డొక్కా  మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ లేఖ రాశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిని మూడు రాజ‌ధానులుగా విడ‌గొట్ట‌డాన్ని వ్య‌తిరేకిస్తున్నాన‌ని ఈ లేఖ‌లో డొక్కా పేర్కొన్నారు. ``2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్రత్తిపాడు నుంచి  పోటీ చేసే అవ‌కాశం ఇచ్చారు. అయితే, ఓట‌మి పాల‌యినా ఓట‌ర్లు/ప్ర‌జ‌లు నా వెంట ఉంటూ వ‌స్తున్నారు. రాజధాని విడిపోవ‌డం వారికి బాధ క‌లిగించే అంశం. 2019 ఎన్నిక‌ల అనుభ‌వం దృష్టా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకొని రాజీనామా చేస్తున్నాను.  తెలుగుదేశం పార్టీలో ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ న‌న్ను ప్రోత్స‌హించారు. ` అని డొక్కా త‌న లేఖ‌లో వెల్ల‌డించారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌గా ఉన్న డొక్కా రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం పొలిటిక‌ల్ క్రాస్‌రోడ్స్‌లో ప‌డిపోయారు. కాంగ్రెస్ బ‌ల‌హీనప‌డ‌టంతో ఆయ‌న  పార్టీ మారడంపై సందిగ్ధంలో పడ్డారు. వైసీపీలో చేరేందుకు ఆయ‌న‌ సన్నద్ధమైనట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఈ నేప‌థ్యంలో డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్ స్పందించారు.  తాను వైసీపీలో చేరడం లేదని.. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. కాగా,  డొక్కా రాజ‌కీయ గురువు రాయ‌పాటి ఇచ్చిన స‌ల‌హాతో ఆయ‌న తెలుగుదేశం పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. అనంత‌రం ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కింది. టీడీపీ శాసన మండలిపక్ష ఉపనేత హోదాను సైతం డొక్కా మాణిక్య వరప్రసాదరావు పొందారు.