రివర్స్ అటాక్ - ‘సాహో’ ని బ్లాక్ బస్టర్ చేయండి : టీడీపీ

September 23, 2020

తన తీరుకు భిన్నమైన ట్వీట్ చేశారు ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్. ఈ నెలాఖరులో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న తెలుగు చిత్రం 'సాహో'ను తెలుగుదేశం పార్టీ అభిమానులంతా చూడాలని ఆయన ట్వీట్ రిక్వెస్ట్ చేశారు. నారా లోకేశ్ ఏంది?.. 'సాహో' సినిమాను చూడాలని ప్రత్యేకంగా ట్వీట్ చేయటం ఏమిటి? అన్న ప్రశ్న మదిలో మెదులుతోందా? దీనికి కారణం లేకపోలేదు.

భారీ బడ్జెట్ తో విడుదలవుతున్న 'సాహో' చిత్రంపై అంచనాలు అంతా ఇంతా కాదు. ఈ చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేయటం తెలిసిందే. రిలీజ్ నేపథ్యంలో జాతీయ.. ప్రాంతీయ మీడియాలతో మాట్లాడిన సందర్భంగా ప్రభాస్ కు ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు ఆయన ఆచితూచి మాట్లాడినట్లు మాట్లాడుతూనే.. జగన్ పాలన బాగుందంటూ ప్రశంసించారు.
డార్లింగ్ ప్రభాస్ నోటి నుంచి ఈ మాట వచ్చిందో లేదో.. సోషల్ మీడియాలో 'సాహో'ను టీడీపీ అభిమానులు వ్యతిరేకిస్తున్నారని.. జగన్ పాలనను ప్రభాస్ పొగిడిన నేపథ్యంలో ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయాల్సిందిగా టీడీపీ వర్గాలు డిసైడ్ అయినట్లుగా ఒక వార్తను వండేశారు. ఇలాంటి మసాలా వార్తలకు ఆన్ లైన్ లో ఉండే ఆదరణ దెబ్బకు.. ఈ విషయం లోకేశ్ వరకూ వెళ్లింది. 
వెంటనే స్పందించిన ఆయన.. తమపై సాగుతున్న దుష్ప్రచారాన్ని ఆదిలోనే అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. తాజాగా లోకేష్ ఆ పనికిమాలిన వెబ్ సైట్ వార్తను కోట్  చేస్తూ.. ఇంతలా దిగజారి వార్తలు రాయటం ఏమిటని మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానుల మాదిరే తానూ సాహో సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో మూవీ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొంటూ.. టీడీపీ కార్యకర్తలంతా ఈ మూవీని చూడాలన్న పిలుపునిచ్చారు. తన మీద నెగిటివ్ ప్రచారానికి తిప్పి కొట్టే క్రమంలో లోకేశ్.. సాహోకు ప్రచారకర్తగా మారిపోయారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.