ఏందిది అప్పలనాయుడు.. ఈ రచ్చేంది?

September 23, 2020

తండ్రికున్న పవర్ తో కళ్లు నెత్తికెక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా మారుతుంటారు కొందరు నేతల సుపుత్రులు. మొన్న వైసీపీ పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్యే కొడుకు హైదరాబాదులో చేసిన రచ్చ చూశాం. ఆ తర్వాత మరో వైసీపీ ఎమ్మెల్యే కొడుకు నడిబజార్లో ట్రాఫిక్ ఆపేసి బర్త్ డే కేక్ కట్ చేసిన దౌర్భాగ్యమూ చూశాం. తాజాగా మాజీ మంత్రి బండారు సత్యానారాయణ కుమారుడు అప్పలనాయుడు కూడా అలాగే రచ్చచేశాడు. ఫుల్ గా తాగేసి.. ఖరీదైన కారుతో అమితమైన వేగంతో రోడ్ల మీద ఇష్టారాజ్యంగా దూసుకెళ్లిన వైనం.. ఒక మెడికో జీవితాన్ని ఇప్పుడు ప్రమాదంలో పడేసింది.సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కొడుకు అప్పలనాయుడు అర్థరాత్రి ఒంటి గంట వేళ తన స్నేహితులతో కలిసి విశాఖ బీచ్ రోడ్ మీద అమితమైన వేగంతో కారులో దూసుకెళుతున్నారు. అదే సమయంలో ఆంధ్ర మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న చంద్రకిరణ్.. అతడి స్నేహితుడు గౌతమ్ లు కలిసి బైక్ మీద బీచ్ రోడ్డు మీద వెళుతున్నారు. చంద్రకిరణ్ బైక్ ను ఢీ కొట్టి.. దగ్గర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద డివైడర్పైకి దసుకెళ్లాడు. దీంతో.. అతడి కారు ముందు భాగం ధ్వంసమైంది.
ఈ ప్రమాదంలో బైక్ మీద నుంచి కిందకు పడిపోయిన చంద్రకిరణ్ తలకు తీవ్ర గాయమైంది. అతడ్ని హుటాహుటిన అక్కడున్న వారు కేజీహెచ్ కు తరలించారు.  తన నిర్లక్ష్యంతో ప్రమాదానికి కారణమైన అప్పనాయుడ్ని స్థానికులు ప్రశ్నించే ప్రయత్నం చేయగా దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో.. అక్కడి వారంతా అతడికి దేహశుద్ధి చేశారు. దీంతో.. స్నేహితుల నుంచి తప్పించుకొని పారిపోయారు. మరోవైపు ప్రమాదానికి కారణమైన కారు నెంబరు ప్లేట్ ను మార్చే ప్రయత్నం చేయటం గమనార్హం. ప్రమాదం జరిగిన వేళలో కారుకు  ఏపీ 31డీపీ 6666 నంబరు ప్లేటు ఉండగా దాని స్థానే ఏపీ 37 సీవీ 0780 నంబరు ప్లేట్ ను అమర్చే ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవటంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా విశాఖకు వచ్చిన రాజ్యసభ సభ్యులు విజయసాయి మాట్లాడుతూ.. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్షలు తప్పవని స్పస్టం చేశారు. అర్థరాత్రి దాటిన తర్వాత మద్యాన్ని విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.