వెంకన్న సొమ్ము స్వాహా!

September 26, 2020

టీటీడీ నిధులు దేవాదాయ శాఖకు మళ్లింపు
సొంత సంస్థలకు మాత్రం అరకొర సొమ్ములు
ఆర్జిత సేవలకిచ్చే లడ్డూలకూ మంగళం
సీఎం జగన్‌ హయాంలో తిరుమలేశుడికి గ్రహణం పట్టినట్లు కనిపిస్తోంది. ఆపదమొక్కులు తీర్చే వెంకన్నకు భక్తకోటికి దూరంచేసే ప్రయత్నాలు చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రజాప్రతినిధులు, దళారులు బ్రేక్‌ దర్శనం టికెట్లను వేల రూపాయలకు అమ్ముకుంటుండగా.. దానిని నివారించాల్సిందిపోయి.. శ్రీవారి దర్శనాన్ని వ్యాపారంగా మార్చేశారు. రూ.10 వేలు విరాళమిస్తే రూ.500కే బ్రేక్‌ దర్శనం కల్పిస్తున్నారు. శ్రీవాణి ట్రస్టుకు రూ.లక్ష విరాళమిస్తే.. 9 బ్రేక్‌ దర్శనం టికెట్లు పొందే వీలుంటుంది. ఓపక్క ఆయన సొమ్మును హారతి కర్పూరంలా కరిగిస్తూ.. ఆదాయం పెంచుకోవడానికంటూ దర్శనాన్ని వ్యాపారమయం చేసేశారు. శ్రీవెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికెంత ఖ్యాతి ఉందో ప్రపంచానికంతా తెలుసు. దైవదర్శనానంతరం ఈ లడ్డూకోసం భక్తులు పరితపిస్తుంటారు. ఇప్పుడు ప్రతి భక్తుడికీ ఒక లడ్డూ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మిగతా సబ్సిడీలన్నీ రద్దుచేసేశారు. అంటే రూ.300 టికెట్‌, బ్రేక్‌ దర్శనం టికెట్‌ కొన్నవారికి రెండేసి లడ్డూలు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడవన్నీ తీసేసి ఎవరికైనా ఎలాంటి సిఫారసు లేకుండా రూ.50కి లడ్డూ విక్రయిస్తున్నారు. శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొన్నవారికి ఇచ్చే ప్రసాదాలకు కూడా టీటీడీ మంగళం పాడింది. భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన పెద్ద లడ్డూలు ఇకపై అదనంగా డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందే. గతంలో ఆర్జితసేవల టికెట్‌ ధరను, సేవ విశిష్టతను బట్టి ప్రసాదాలు ఉచితంగా ఇచ్చేవారు. వారాంతపు సేవల్లో విశేష పూజకు ఒక పెద్ద లడ్డూ, వడ.. అష్టదళ పాదపద్మారాధనకు 2 పెద్ద లడ్డూలు, 2 వడలు.. సహస్ర కలశాభిషేకానికి పెద్ద లడ్డూ, వడ, 2 అప్పాలు.. తిరుప్పావడైకి  పెద్దలడ్డూ, వడ, జిలేబీ, మురుక, వస్త్రం.. అభిషేక సేవకు 2 పెద్దలడ్డూలు, 2 వడలు, నిజపాదసేవకు 2 లడ్డూలు ఇచ్చేవారు. నిత్యసేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, ఊంజల్‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, దీపాలంకార సేవలకు 2 లడ్డూలు.. కల్యాణోత్సవానికి 2 పెద్ద లడ్డూలు, 2 వడలు, 5 చిన్న లడ్డూలు ఉచితంగా ఇచ్చేవారు. ప్రస్తుతం వాటన్నిటినీ తొలగించి భక్తులకు ఒక్కొక్కరికి ఒక ఉచిత లడ్డూ మాత్రమే ఇస్తున్నారు. ఆయా సేవలకు సంబంధించిన ప్రసాదాలు కావాలంటే అదనంగా నగదు ఇవ్వాల్సిందే. కల్యాణోత్సవంలో పాల్గొనే చాలామంది భక్తులు పెద్దలడ్డూ కోసమే పరితపిస్తుంటారు. అలాంటి వారికి ఇప్పుడు అదనంగా నగదు చెల్లించాలని సూచిస్తున్నారు. అవసరమైతే ఆర్జిత సేవ టికెట్ల ధర పెంచాలి గానీ.. అత్యంత భక్తితో స్వీకరించే ప్రసాదాన్ని గౌరవప్రదంగా ఇవ్వకపోవడమేంటి?
ప్రభుత్వ కార్యకలాపాలకు స్వామి ధనమా?
ఇక శ్రీవారికి భక్తులు సమర్పించిన విరాళాలను తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఆధ్వర్యంలోని సంస్థలకు, సేవలకు ఖర్చు చేయాలి.. కానీ జగన్‌ బాబాయి వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌ అయ్యాక.. తనకు సంబంధం లేని ప్రభుత్వ కార్యకలాపాలకు టీటీడీ మళ్లిస్తోంది. ముఖ్యంగా దేవాదాయ శాఖకు భారీగా నిధులు మళ్లించడం వివాదాస్పదంగా మారింది. టీటీడీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను సవరిస్తూ ఇటీవల పాలకమండలి సమావేశంలో చర్చకు పెట్టారు. ఆ సందర్భంగా దేవస్థానానికి చెందిన సంస్థలకు స్వల్ప మొత్తాల్లో నిధులను పెంచిన పాలక మండలి.. టీటీడీకి సంబంధం లేని ప్రభుత్వ కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించింది. ‘సర్వ శ్రేయోనిధి’గా పిలిచే కామన గుడ్‌ ఫండ్‌(సీజీఎఫ్‌)కు బడ్జెట్‌లో తొలుత రూ.1.25 కోట్లు మాత్రమే కాంట్రిబ్యూషన కింద కేటాయించారు. బడ్జెట్‌ సవరింపుల్లో ఏకంగా రూ.13.75 కోట్లు అదనంగా కేటాయించారు. దేవాదాయ శాఖ సంక్షేమ నిధికి తొలుత రూ.50 లక్షలు మాత్రమే కేటాయించగా సవరింపుల్లో రూ.10 కోట్లకు పెంచారు. అర్చకుల వేతనాల నిధికి కూడా బడ్జెట్‌లో తొలుత రూ.50 లక్షలు కేటాయించిన టీటీడీ.. తాజా సవరింపుల్లో ఒకేసారి రూ.25 కోట్లకు పెంచింది. దేవాదాయ శాఖ అర్చకుల వేతనాలకు బడ్జెట్‌లో తొలుత అసలు కేటాయింపులేవీ చేయలేదు. తాజా సవరింపుల్లో రూ.16 కోట్లు కేటాయించారు. అంటే మొత్తం రూ.66 కోట్లకు పెంచడం గమనార్హం. అర్చకులకు వేతనాలు పెంచింది ప్రభుత్వం. ఆ డబ్బును తన జేబులో నుంచి తీయకుండా టీటీడీ నుంచి సంగ్రహిస్తోందన్న మాట. టీటీడీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సొంత సంస్థలకు బడ్జెట్‌లో తక్కువ మొత్తం కేటాయించారు. సొంత విద్యా సంస్థలకు 2019-20 బడ్జెట్‌లో తొలుత రూ.105 కోట్లు కేటాయించిన టీటీడీ.. తాజా సవరింపుల్లో రూ.8 కోట్లు పెంచింది. ఇతర విశ్వవిద్యాలయాలకు ఇచ్చే గ్రాంట్స్‌ను తొలుత రూ.22.50 కోట్లు కేటాయించగా సవరణలో పైసా కూడా పెంచలేదు. ఇక టీటీడీ నిర్వహిస్తున్న ఆస్పత్రులు, డిస్పెన్సరీల నిర్వహణకు బడ్జెట్‌లో రూ.47 కోట్లు కేటాయించగా సవరింపుల్లో కేవలం రూ.3 కోట్లు పెంచారు. అదే స్విమ్స్‌, బర్డ్‌, ఎస్‌ఎస్‌ఎస్‌ఎన ట్రస్టు, శ్రవణం ప్రాజెక్టు వంటి పరోక్షంగా నిర్వహిస్తున్న సంస్థలకు బడ్జెట్‌లో తొలుత రూ.79 కోట్లు కేటాయించగా సవరింపుల్లో రూపాయి కూడా పెంచలేదు.
నిధుల మళ్లింపుపై దుమారం
టీటీడీ నిధులను భారీగా ఇతర కార్యక్రమాలకు మళ్లించడం పట్ల దుమారం రేగుతోంది. ఇప్పటికే టీటీడీ తీసుకుంటున్న అనేక నిర్ణయాలతో ఆర్థిక పరిస్థితి క్రమేపీ దిగజారుతోందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవాదాయశాఖకు సంబంధించిన పలు ఇతర బాధ్యతలను నెత్తికెత్తుకోవడం టీటీడీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుందన్న వాదన వినిపిస్తోంది. సాంకేతికంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ నిధులను ఇతర అవసరాలకు మళ్లించాలని ఆదేశించలేదు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన ఉన్నా.. ఆదేశం మాత్రం కాదు. దాన్ని తప్పనిసరిగా పాటించాలన్న నిబంఽధనేదీ లేదు. తాజా ఉదంతంలో అధికారులు దీనిని పట్టించుకోలేదు. కాగా.. పాలకమండలి ఒత్తిళ్ల మేరకు కొత్తగా మరిన్ని ఆలయాలను టీటీడీ దత్తత తీసుకుంటోంది. కొత్త పాలకవర్గం ఏర్పాటయ్యాక రెండో సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు కొత్త ఆలయాలను దత్తత తీసుకోవడం వల్ల టీటీడీపై ఆర్థిక భారం మరింత పెరిగిపోనుంది. వీటిపై టీటీడీ ఆర్థిక సలహాదారు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. దీనిపై కోర్టును ఆశ్రయించేందుకు బీజేపీ నేతలు కొందరు సిద్ధమవుతున్నారు. టీటీడీ ఖర్చులపై కాగ్‌తో ఆడిట్‌ చేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు

Read Also

చంద్రబాబును ఇలా ఎపుడూ చూసి ఉండరు
హౌస్ అరెస్టు నుంచి విడుదల, బయటకొచ్చి ఏం చేస్తాడు ? 
పోలవరంపై కేంద్రం మడత పేచీ!

RELATED ARTICLES

  • No related artciles found