‘జార్జ్‌రెడ్డి’ రివ్యూ 

September 24, 2020

నటీనటులు: సందీప్‌ మాధవ్‌, అభయ్‌, సత్యదేవ్‌, శత్రు, మనోజ్‌ నందన్‌, ముస్కాన్‌ తదితరులు

సంగీతం: సురేష్‌ బొబ్బిలి, హర్షవర్థన్‌ రామేశ్వర్‌(నేపథ్య సంగీతం)

సినిమాటోగ్రఫీ: సుధాకర్‌ యక్కంటి

ఎడిటింగ్‌: జె.ప్రతాప్‌ కుమార్‌

నిర్మాత: అప్పిరెడ్డి, సంజీవ్‌రెడ్డి

దర్శకత్వం: జీవన్‌రెడ్డి

బ్యానర్‌: మిక్‌ మూవీస్‌, సిల్లీ మాంక్స్‌, అభిషేక్‌పిక్చర్స్‌

 

కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందు ఓ రేంజిలో బజ్ క్రియేట్ చేస్తాయి. అయితే... చిన్న సినిమాలు అలాంటి బజ్ క్రియేట్ చేయడం చాలా అరుదు. ఆ అదృష్టం జార్జిరెడ్డికి దక్కింది.

జార్జిరెడ్డి సినిమా కూడా రిలీజ్ కు ముందు మామూలు రచ్చ చేయలేదు. ట్రైలర్స్ తో తాండవమాడేసింది. దానికి తోడు ఇదీ ఓ బయోపిక్కే. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ఈ సినిమా చూసాక సామాన్యుడు రియాక్షన్ ఏమిటి...అసలు జార్జిరెడ్డి నిజ జీవిత కధని ఈ సినిమాలో ఉన్నదున్నట్లు తెరకెక్కించారా..మ్యాటరేంటి వంటి విషయాలు కోసం రివ్యూలోకి వెళదాం.

స్టోరీ జార్జిరెడ్డి (సాండీ) చిన్నతనంనుంచి అంటే మరీ నాలుగేళ్ల వయస్సు నుంచే బ్లేడ్ పట్టుకుని అన్యాయాన్ని ఎదురిస్తూంటాడు. అక్రమాలకు చెక్ పెడుతూంటాడు. మరి చిన్నప్పుడే అలా ఉంటే పెద్దయ్యాక ఎలా ఉంటాడు. అతను ఎలా తయారవుతాడు అంటే మీరు ఊహించినట్లే...వయస్సుతో పాటు ఆవేశం పెంచుకుని దుర్మార్గుల తాట తీసే పోగ్రాం పెట్టుకుంటాడు. అలాంటి ఈ కుర్రాడు అప్పటికే రకరకాల విధ్యార్ది రాజకీయాలతో సెగలు కక్కుతున్న ఉస్మానియా క్యాంపస్ లోకి అడుగుపెడతాడు. అక్కడకు వచ్చాక తనకు చాలా పని ఉందని అర్దం చేసుకుంటాడు. తాడిత,పీడిత విధ్యార్దులకు అండగా నిలబడటం మొదలెడతాడు. వాళ్లకు లీడర్ అవుతాడు. ఇది అప్పటికే పాతుకుపోయిన అప్పటి విధ్యార్ది సంఘ నాయకులైన ఎబిసిడీ నాయకుడు సత్య(సత్యదేవ్)కి, అర్జున్ (మనోజ్ నందం)లకు మింగుడు పడదు. దాంతో వాళ్లు ఎదురు దాడి మొదలెడతాడు. దాంతో క్యాంపస్ రణరంగంగా మారిపోతుంది. ఆ క్రమంలో అనేక సార్లు జార్జిరెడ్డిని చంపటానికి ప్రయత్నాలు జరుగుతాయి. కానీ చిన్నప్పటి నుంచి కత్తిసాము, కర్రసాము, బాక్సింగ్‌లో ప్రావీణ్యం ఉండటం కలిసొస్తుంది. కానీ ప్రతీసారి అదృష్టం మనవైపే ఉండదు కదా...జార్జిరెడ్డి ఎప్పుడైతే ఎలక్షన్స్ లో నిలబడి గెలిచాడో తమ ఫీఠాలు కదిలిపోయాయని భావించిన ప్రత్యర్ది వర్గం ఈ సారి అతని కథ ముగించకపోతే తమ మనగడ ముగిసినట్లే అని భావించి హత్యా ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సారి వాళ్లు సక్సెస్ అవుతారు. అప్పుడు ఏమైంది..జార్జి రెడ్డి ని హత్య చేసేటంతటి పరిస్దితులు ప్రత్యర్దులకు ఏమొచ్చాయి. అతని లవ్ స్టోరి ఏమిటి వంటి విషయాలు తెలుసుకోవాలని ఉంటే సినిమా చూడాల్సిందే.

కథా, కథనం ఎలా ఉంది...

ఎన్ని వివాదాలు ఉన్నా..ఏ ప్రచారాలు ఉన్నా జార్జిరెడ్డి ఓ జనరేషన్ ని ప్రభావితం చేసిన వ్యక్తి. స్టూడెంట్ లీడర్ గా ఉస్మానియా చరిత్ర కలిగిన శక్తి. ఆయన బయోపిక్ అంటే ఖచ్చితంగా కొన్ని వర్గాల్లో ఆసక్తి ఉంటుంది. అది మనకు రిలీజ్ ముందు జనాల్లో కనపడిన ఉత్సాహంలో ప్రతిబింబించింది. అయితే జనాల్లో రగిల్చిన ఆ ఉద్వేగాన్ని పూర్తి స్థాయిలో సినిమా క్యాష్ చేసుకోలేకపోయిందనే చెప్పాలి. వాస్తవాల్లోనే ఎక్కువగా దర్శకుడు ముందుకుపోవడం వల్ల సినిమాటిక్ ఎమోషన్ తక్కువుంది. డాక్యుమెంటరీ లక్షణాలు ఎక్కువ. కాకపోతే మంచి ఇన్ఫర్మేటివ్. ఈ జనరేషన్ కి ఒక సర్ ప్రైజ్. ఇప్పటికే జార్జిరెడ్డి కథను అనేక సినిమాల్లో సీన్స్ గా వాడేసారు. తెలుగు సినిమాను మలుపు తిప్పిన శివ సినిమాలో సైతం జార్జిరెడ్డి జీవితం నుంచి తీసుకున్న సన్నివేశాలు ఉన్నాయి. అవి ఆ కాలానికి సంభందించిన ఘటనలు. సంఘటనలు. అయితే .. ఈ కాలం వాళ్లకు అవి చాలా లైట్ గా కనిపిస్తాయి...ఎలక్షన్స్ కాలేజీలో జరగటం.వాటి కోసం చావులు దాకా వెళ్లటం అనేదే ఈ జనరేషన్ కు చాలావరకు అర్దం కాదు. కాలేజి ఎలక్షన్స్ కు అంత సీన్ ఏంటని నవ్వేస్తారు. ఇప్పటి కాలేజీల్లో ఆ పరిస్దితులు లేవు. అలాంటి జనరేషనే ఇప్పుడు థియోటర్ కు వస్తోంది. వారిని మెప్పించాలి. ఎందుకంటే జార్జిరెడ్డి కాలం నాటి వారు ఎవరూ థియోటర్ కు సినిమాలకు వెళ్లటం లేదు. సరే అదేముంది అప్పటి కథ కాబట్టి ఆ సీన్స్ తో చెప్పాం అనొచ్చు. ఆ యాంగిల్ లో చూస్తే బాగుందనిపిస్తుంది. రెండు గంటలకు పైగా థియోటర్ లో కూర్చుని చూడటానికి సరిపడా ప్యాకేజీ మిస్ ఫైర్ అయ్యింది. అయితే, ఇది రైటింగ్ సైడ్ జరిగిన తప్పు. లెప్ట్ ఐడియాలజీని ప్రభోదిస్తూనే ఫైట్స్ కు ప్రాముఖ్యతనిస్తూ సినిమా సాగుతూ విసిగిస్తుంది.

హైలెట్స్

ఈ సినిమాకు ప్లస్ ..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫైర్ బాల్ సీక్వెన్స్, బెల్ట్ ఫైట్..ఇవి ఇంతకు ముందు మనం చూడలేదు. జార్జి రెడ్డిగా చేసిన సందీప్ మాధవ్ మరింత టాలెంటును చూపాల్సి ఉండింది. సినిమాటోగ్రఫీ మైనస్.