రెడ్డి గారి ‘గోల్డ్’ దెబ్బ... సురేంద్రబాబు ఉన్నపళంగా బదిలీ

September 25, 2020

ఏపీలో ఇప్పుడంతా రెడ్డి రాజ్యమే నడుస్తుందోన్న వాదనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న వరుస నిర్ణయాలు నిలుస్తున్నాయని కూడా చెప్పాలి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రివర్స్ టెండర్లలో పాలుపంచుకున్న ‘మేఘా’ కృష్ణారెడ్డి... దాదాపుగా కాంట్రాక్టును దక్కించేసుకున్నారు. వచ్చింది సింగిల్ బిడ్డే కాబట్టి... ఆ కంపెనీకి ఎలా చూసిన పనులు అప్పగించడానికి లేదు. అయితే మేఘా కంపెనీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కృష్ణారెడ్డి కాబట్టి... దాదాపుగా ఆ కంపెనీకే పనులు కట్టబెట్టే దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. అంతేనా... నిర్దేశిత వ్యయం కంటే రూ.782 కోట్ల మేర తక్కువకు కోట్ చేసిన కృష్ణారెడ్డికి జగన్ సర్కారు... ఏకంగా 11 వేల కోట్ల మేర లబ్ది చేకూర్చే యత్నాలను ఇదిరవకే ప్రస్తావించుకున్నాం కదా. ఈ యత్నాలకు అడ్డుగా నిలుస్తున్నారన్న కారణంగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్వీ సురేంద్ర బాబును ప్రభుత్వం ఆఘమేఘాల మీద బదిలీ చేసి పారేసాంది. అధికారులన్నాక బదిలీ సాధారమే అయినా.. సంస్థ ఉద్యోగుల్లో మనోస్థైర్యాన్ని నింపడంతో పాటు తన విధి నిర్వహణలో ఇప్పటిదాకా చిన్న మచ్చ కూడా లేకుండా పనిచేసిన సురేంద్ర బాబును ఉన్నపళంగా బదిలీ చేయడం వెనుక చాలా పెద్ద తతంగమే జరిగిందట.

ఆ తతంగమేమిటన్న విషయానికి వస్తే... పోలవరం ప్రాజెక్టు పనులకు తక్కువకు చేసేందుకు ఒప్పేసుకున్న మేఘా కృష్ణారెడ్డికి మరో రకంగా లబ్ది చేకూర్చేలా జగన్ సర్కారు ప్లాన్ వేసింది కదా. కృష్ణారెడ్డికి చెందిన గోల్డ్ స్టోన్ సంస్థ నుంచి ఏపీఎస్ఆర్టీసీ 350 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకుంటోంది కదా. ఈ బస్సులను కొనుగోలు చేయకుండా... గోల్డ్ స్టోన్ నుంచి అద్దెకు తీసుకుంటోందట. ఈ అద్దె ఖరారు వద్దే అసలు చిక్కు వచ్చి పడిందట. కృష్ణా రెడ్డికి చెందిన గోల్డ్ స్టోన్ ఇప్పటికే తెలంగాణ సహా కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తిప్పుతోందట. తెలంగాణ సర్కారు ఈ బస్సులకు కిలో మీటరుకు రూ.36 చొప్పున అద్దె చెల్లిస్తోందట. అయితే ఏపీలో మాత్రం ఆ అద్దెను ఏకంగా రూ.60గా ఖరారు చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయట. అయితే ఈ రేట్లకు సురేంద్ర బాబు ససేమిరా అన్నారట. అంతేకాకుండా పొరుగు రాష్ట్రంలో రూ.36ల అద్దెకే సేవలు అందిస్తున్న గోల్డ్ స్టోన్ కు ఇక్కడ ఏకంగా రూ.60 ఎలా ఇస్తామని కూడా సురేంద్ర బాబు ప్రశ్నించారట.

దీంతో సురేంద్ర బాబును ఎలాగోలా ఒప్పించేందుకు వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు భేటీ అయ్యారట. అయినా కూడా సురేంద్ర బాబు ఒప్పుకోలేదట. దీంతో ఇంకేం చేయాలన్న ఆలోచనతో సురేంద్ర బాబును ఉన్నపళంగా తప్పించడమొక్కటే మార్గమని భావించిన జగన్ సర్కారు... అదే పనిచేసిందట. ఈ తంతు ఇంత త్వరగా ఎందుకు చేపట్టిందన్న విషయానికి వస్తే... రేపు ఈ అద్దెలను ఖరారు చేయబోతున్నారట. సో.. కృష్ణారెడ్డి అద్దె ప్రతిపాదనలకు ససేమిరా అన్న సురేంద్రబాబును అద్దెలు ఖరారు చేయడానికి ఒక్కరోజు ముందుగా బదిలీ చేశారన్న మాట. అంతేనా... ఆర్టీసీ ఎండీ పదవి నుంచి బదిలీ చేసిన జగన్ సర్కారు... ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని మాత్రమే సూచించిందట. మొత్తంగా జగన్ రెడ్డి... తన సామాజిక వర్గానికి చెందిన కృష్ణారెడ్డికి లబ్ది చేకూర్చడానికి ఫిక్స్ అయిపోయి... ఆ తంతును అడ్డుకున్నారన్న నెపంతో సురేంద్రబాబుపై బదిలీ వేటు వేసిందన్న మాట.