పార్లమెంటులో నవ్వులపాలయిన వైసీపీ ఎంపీ

September 24, 2020

వివాదాస్ప‌ద వైఎస్సార్ కాంగ్రెస్ నాయ‌కుడు, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాల గురించి శ‌నివారం లోక్ స‌భ‌లో సీరియ‌స్‌గా చ‌ర్చ జరుగుతున్న స‌మ‌యంలో ఆయ‌న నిద్ర పోతూ క‌నిపించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ముందు ఒక ఎంపీ సీరియ‌స్‌గా మాట్లాడుతుంటే.. స‌భ మొత్తం పెద్ద ఎత్తున నినాదాలు సాగుతుంటే.. ఎంపీ ఏమీ ప‌ట్ట‌న‌ట్లు నిద్ర‌లోకి జారుకున్నారు. మామూలుగా అయినా దీన్ని ప‌ట్టించుకునేవాళ్లు కాదు కానీ.. గోరంట్ల మాధ‌వ్ మీద రేప్ కేసు పెండింగ్‌లో ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న మీడియాకు టార్గెట్ అయిపోయారు. సోష‌ల్ మీడియాలో మాధ‌వ్ వీడియో వైర‌ల్ అయింది.

మాధ‌వ్ మీద పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. త‌న మీద సెక్ష‌న్ 376 కింద‌ రేప్ కేసు, 302 కింద హ‌త్య కేసు పెండింగ్‌లో ఉన్న‌ట్లు ఈ ఏడాది ఎన్నిక‌ల అఫిడ‌విట్లో మాధ‌వ్ వెల్ల‌డించారు. ఆ కేసుల వివ‌రాలేంటో కానీ.. రేప్ కేసు పెండింగ్‌లో ఉన్న వ్య‌క్తి రేప్‌ల మీద చ‌ర్చ జ‌రుగుతుంటే నిద్ర పోక ఎలా యాక్టివ్‌గా ఉంటారంటూ నెటిజ‌న్లు ఆయ‌నపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఎంపీ కాక ముందు పోలీస్ అధికారిగా ఉంటూ అప్ప‌టి ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డితో గొడ‌వ పెట్టుకోవ‌డం, ఎంపీ అయ్యాక కియా కార్ల ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధుల‌తో వాగ్వాదానికి దిగ‌డం లాంటి ఘ‌ట‌న‌ల‌తో మాధ‌వ్ ఇంత‌కుముందే మీడియాలో హైలైట్ అయ్యారు.