మా దగ్గర అమరావతికి డబ్బుల్లేవబ్బా...

September 24, 2020

ఏదైనా సాధించడానికి మనిషికి దేవుడిచ్చిన ఆయుధం మెదడు. అందుకే శూన్యం నుంచి ప్రపంచాన్ని ఏలిన కోటీశ్వరులు పుట్టారు. మంచి పాలన అందిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి టీం... అసలు పాలనే లేని స్థితికి వచ్చింది. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా రాజధానిని కెలికి సుమారు ఏపీలోని మూడో వంతు జనాభాకు నరకం చూపిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనట్టు రాజధాని మార్చడమనే ఒక విచిత్ర పనికి పూనుకుంది. ఇక దీనిపై ఒక్కో వైసీపీ నేత మాట్లాడుతుంటే చాలా వింతగా విచిత్రంగా ఉంది. 

ఈరోజు గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే... తన జిల్లా నుంచి రాజధాని తరలిపోతుంటే... పోరాడలేదు, ప్రజలకు క్షమాపణ చెప్పలేదు. పైగా స్వయంగా జిల్లాకు అన్యాయం చేసేపనికి సంతోషంగా మద్దతు పలుకుతున్నారు. అమరావతి రాజధానిగా ఉంటే గుంటూరు జిల్లాలోని ప్రతి పౌరుడికీ లాభమే. అయినా ఆ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు తమ ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి జగన్ కోరిక తీరుస్తున్నారు. తాజాగా అంబటి దీనిపై మాట్లాడుతూ రాజధానికి ఇప్పటివరకు 5 వేల కోట్లే పెట్టారు. రాజధాని పూర్తవ్వాలంటే...ఇంకా లక్ష కోట్లకుపైన కావాలి. ప్రభుత్వం వద్ద డబ్బులేదు. అందుకే రాజధాని మారుస్తున్నాం అంటున్నారు. ఇంతకంటే పేలవమైన వాదన ఉండదు. దీనికి కారణం అంబటి అవగాహన రాహిత్యం.

అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టులాగా గత ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఇప్పటికంటే అపుడు తక్కువ డబ్బులే ఉన్నాయి. ఆ విషయం స్పృహలో ఉంచుకునే అమరావతికి రూపకల్పన జరిగింది. అమరావతి అనేది చాలా తక్కువ డబ్బులతో పూర్తయ్యే నగరం. రాష్ట్రంలో 13 జిల్లాలకు మధ్యలో అందుబాటులో నదీతీరంలో ఉన్న నగరం. ప్రకృతి విపత్తులను చూడని నగరం. ప్రపంచ నగరాలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారాలు వెతికి  నిర్మాణానికి ప్లాన్ చేసిన నగరం. అలాంటి నగరాన్ని దారుణంగా గొంతు నులిమి చంపే  ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆయనకు అమరావతి ప్రాంతపు ఎమ్మెల్యేలే వంత పాడటం దారుణం. 

ప్రభుత్వం అంటే డబ్బులుంటే వాడుకునే వ్యవస్థ కాదు. సంపద సృష్టించే వ్యవస్థ. డబ్బులను సృష్టించే వ్యవస్థ. ఉపాధి, ఉద్యోగాలు, ఆర్థికవనరులు పెరగడానికి ఉపయోగపడే వ్యవస్థ. దానిని నిర్వహించగలిగిన సామర్థం లేదు. లేకపోయినా పర్లేదు గాని నాశనం చేసే పనులు చేస్తే ప్రజల భవిష్యత్తు అందకారం అవుతుంది. ఇది పాలకులే కాదు, ప్రజలు ముందుగా గ్రహించాలి.