చంద్రబాబుకు, జగన్ కు తేడా... ఇదే

September 25, 2020

చంద్రబాబును ఎందుకు ఓడించారో చంద్రబాబుకు మాత్రమే కాదు, చంద్రబాబును ఓడించిన జనానికి కూడా తెలియదు.... ఇది ఓ ప్రభుత్వ అధికారి కామెంట్. అస్తవ్యస్తమైన పాలన, పథకాలకు కోతలు, అండగా నిలిచిన సామాన్యులకు మొండిచేయి, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూసిన తర్వాత వచ్చిన అందరిలో ఒకరకమైన అసంతృప్తి. అయితే... బాబును ఓడించడానికి కారణం తెలియకపోయినా... ఆ పరిస్థితికి దారితీసింది మాత్రం చంద్రబాబు స్వయంకృతాపరాధమే. ఇది ఎలాగో ఒక తాజా సంఘటనను, ఒక పాత సంఘటనను చెప్పుకుంటే తెలుస్తుంది.

తాజా ఘటన -

ఇటీవల వైజాగ్ సమావేశంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ‘‘జగన్ రక్తంలోనే రౌడీయిజం ఉందని, రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిందని.. శాంతిభద్రతలు అదుపు తప్పాయని, రాష్ట్రం పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారింది‘‘ అని వ్యాఖ్యానించారు. దీని గురించి ఒక వైసీపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేశారు. అయ్యన్నను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని ఇలాంటి వ్యాఖ్యలతో అవమానిస్తారా అంటూ వారు ప్రశ్నించారు. 

పాత ఘటనలు -

గోబెల్స్ వారసుడు చంద్రబాబు. (అనేక సార్లు అన్నాడు)

చంద్రబాబు హయాంలో సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్. (20-03-2019)

చంద్రబాబు అంతటి మాయావి ఎవరూ ఉండరు. (19-03-2019)

చంద్రబాబు నిజంగా నేరస్థుడు. (20-03-2019)

చంద్రబాబు అంత దిక్కుమాలిన వ్యక్తి ఎవరూ ఉండరు. (20-3-2019)

ఆంధ్రప్రదేశ్ లో ఒక దొంగ, రాక్షసుడు, నేరస్థుడు పాలన సాగిస్తున్నాడు. (5-3-2019)

ఇవన్నీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు. మరి అయ్యన్న పాత్రుడు జగన్ ను విమర్శించినందుకు అయ్యన్న మీద కేసులు పెడితే... ఆనాటి ముఖ్యమంత్రిని ఇంత పరువు నష్టం చేస్తూ వ్యాఖ్యలు చేసినందుకు, నేరారోపణలు చేసినందుకు జగన్ మీద ఏ కేసులు పెట్టాలి? ఏమీ పెట్టలేదు. అలా పట్టించుకోకుండా చంద్రబాబు వదిలేశాడు కాబట్టే... అతని విమర్శలు నానాటికీ పెరిగి విస్తరించి చంద్రబాబును ఓటమి దాకా తీసుకెళ్లాయి. మరి ఇది చంద్రబాబు స్వయంకృతాపరాధమే కదా. కానీ శత్రువులను అణచడం ఇంటా వంటా లేదు కాబట్టి నేను కేసులు పెట్టను అని చంద్రబాబు అనుకుంటే... అణచివేతకు సిద్ధంగా ఉండాలి. అణచివేయబడటం నీ ఇంటా వంటా ఉందా చంద్రబాబూ !!