హౌడీ మోదీ.. ఒక్క సభతో ఇంటర్నేషనల్ ఫిగర్‌గా ఎదిగిన మోదీ

September 25, 2020

అమెరికాలోని హూస్టన్‌లో నిర్వహించిన ‘హౌడీ మోదీ’ సభ అంతర్జాతీయ యవనికపై భారత ప్రధాని మోదీ ఇమేజ్‌ను ఒక్కసారిగా 100 రెట్లు పెంచేసింది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న మోదీ తాజా సభతో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కి సన్నిహిత మిత్రుడిగా ప్రొజెక్ట్ చేసుకోగలిగారు. ప్రపంచ దేశాలన్నీ నిన్నటి సభను చూశాయి... మోదీ పాల్గొన్న ఆ సభకు ట్రంప్ రావడం దగ్గర నుంచి, మోదీని ఆయన ప్రశంసించిన తీరు, మోదీకి ఇచ్చిన ప్రాధాన్యం అన్నీ ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపించాయి. ఇది భారత్‌తో వైరం ఉన్న పాకిస్తాన్, చైనాలకు గట్టి ప్రతికూల సంకేతమే అయింది.
హోస్టన్ వేదిక సాక్షిగా మోదీ, ట్రంప్ చేసిన ప్రసంగాలు ఆకట్టకున్నాయి. మోదీ మాట్లాడుతూ.. భారత్-అమెరికా సంబంధాల్లో సరికొత్త శకం ఆవిష్కృతమైందని అన్నారు. 50 వేల మందికి పైగా హాజరైన హౌడీ-మోదీ చారిత్రక సదస్సులో మోదీ.. తొలుత ట్రంప్‌కు ఆహ్వానం పలుకుతూ తొలుత ఆంగ్లంలో మాట్లాడారు. ఆ తరువాత ట్రంప్ ప్రసంగించారు. అనంతరం మళ్లీ మాట్లాడిన మోదీ హిందీలోనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. భారత దేశంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. మొదటి ఐదేళ్ళు అధికారంలో ఉన్న తాము అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామని, అనంతరం కూడా రెండో సారి తిరుగులేని మెజారిటీతో చేపట్టి అనేక సంచలన నిర్ణయాలను అమలు చేశామన్నారు. జన్-ధన్‌తో సహా తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను భారత్ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయన్నారు.
ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య విశిష్టతను యావత్ ప్రపంచానికి చాటి చెప్పాయన్నారు. అమెరికా జనాభాకు రెండింతల సంఖ్యలో అంటే 61 కోట్ల మంది భారతీయులు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని మోదీ తెలిపారు. అత్యంత చౌకగా భారత దేశంలో డేటా అందుబాటులోకి వస్తున్నదని, అన్ని రంగాల్లోనూ అమలులోకి వచ్చిన ఆన్‌లైన్ సేవలతో పరిపాలన కూడా అనూహ్య వేగాన్ని పుంజుకున్నదని మోదీ తెలిపారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370 రాజ్యాంగ అధికరణ రద్దు ద్వారా ఆ రాష్ట్ర ప్రజలకు నవశకాన్ని అందించామని మోదీ తెలిపారు. ఈ అధికరణ వల్లే జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదం వెర్రితలలు వేశాయన్నారు. మోదీ ఓ వ్యక్తి మాత్రమేనని, అఖండమైన భారతీయుల మద్దతుతోనే తిరుగులేని రీతిలో ముందుకు సాగుగలుగుతున్నామని మోదీ అన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం కంకణబద్ధంగా పని చేస్తున్నదని మోదీ తెలిపారు. గత ఐదేళ్ళుగా ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం నెలకొన్నా భారత్ వృద్ధి రేటు బలంగా, స్థిరంగా సాగిందని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.
ట్రంప్ ఏమన్నారు?
ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తిన మోదీ ఆయన నాయకత్వ పటిమను కొనియాడారు. మోదీ తనకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడని ట్రంప్ చెప్పారు. మొదట మాట్లాడిన ట్రంప్ ప్రసంగాన్ని మోదీ ఆద్యంతరం ఆసక్తిగా విన్నారు. ట్రంప్ తన ప్రసంగంలో ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలతో పాటు ప్రజాపరంగా పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని కూడా ప్రశంసించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింతగా బలోపేతం అయ్యాయని ట్రంప్ అన్నారు. భారత్‌లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బలమైన, అభివృద్ధి పథంలో పరుగెడుతున్న భారత్ కనిపిస్తోందన్నారు.  మోదీ సారథ్యంలో భారత్ మరింత శక్తిని పుంజుకున్న విషయాన్ని యావత్ ప్రపంచం గమనిస్తున్నదని ట్రంప్ అన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి భారతీయ అమెరికన్లకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తున్నామని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాలకు సరిహద్దు భద్రత అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.