కోట్ల నుంచి లక్షల్లోకి పడిపోయిన నాగ్

September 26, 2020

అక్కినేని నాగార్జున పరిస్థితి సినిమా సినిమాకూ దయనీయంగా తయారవుతోంది. కొన్నేళ్ల కిందట తన మార్కెట్ పడిపోతున్న దశలో ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఊపిరి’ లాంటి వరుస హిట్లతో భలేగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు నాగ్. కెరీర్లో ఆ దశలో రూ.50 కోట్ల షేర్ సినిమా నాగ్ నుంచి వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ‘సోగ్గాడే’తో ఆ ఫీట్ అందుకుని ఆశ్చర్యపరిచాడు.

కానీ సక్సెస్ సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం కష్టమని నాగ్ విషయంలోనూ రుజువైంది. సరైన సినిమాలు ఎంచుకోక వరుసగా డిజాస్టర్ల మీద డిజాస్టర్లు తిన్నాడాయన. అతిథి పాత్ర చేసిన ‘నిర్మలా కాన్వెంట్’, తనకు అచ్చొచ్చిన జానర్లో చేసిన ‘ఓం నమో వేంకటేశాయ’ పెద్ద డిజాస్టర్లయ్యాయి. ‘రాజు గారి గది-2’ అంచనాల్ని అందుకోలేకపోయింది. ‘ఆఫీసర్’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ఎన్నో ఆశలతో, ఎంతో ప్లాన్ చేసిన చేసిన ‘దేవదాస్’ కూడా నిరాశ పరిచింది. ఇప్పుడు ‘మన్మథుడు-2’ సైతం ఆయనకు ఆశించిన ఫలితాన్నిచ్చేలా లేదు. ఒక దశలో నాగ్ సినిమాలు ఏరియాల వారీగా తొలి వారాంతంలో ప్రతి రోజూ కోట్లల్లో వసూళ్లు రాబట్టేవి. కానీ ఇప్పుడు షేర్ లక్షలకు పడిపోయింది. పాజిటివ్ బజ్ ఉండి కూడా ‘మన్మథుడు-2’ తెలంగాణ మొత్తంలో తొలి రోజు కోటి రూపాయల షేర్ రాట్టలేదు. రూ.97 లక్షలే షేర్ వచ్చింది.

రెండో రోజు వసూళ్లలో డ్రాప్ అనివార్యమైంది. షేర్ రూ.60 లక్షలకు అటు ఇటుగా వచ్చింది. రెండో రోజుల్లో 1.57 కోట్ల షేర్‌ మాత్రమే సాధించిన ఈ చిత్రం.. ఈ ప్రాంతంలో రూ.7 కోట్ల టార్గెట్‌కు దరిదాపుల్లో కూడా వెళ్లేలా కనిపించడం లేదు. ఆంధ్రా, సీడెడ్ ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రూ.21 కోట్ల టార్గెట్ నాగార్జునకు కేక్ వాక్ అంటూ అభిమానులు గొప్పలు పోయారు కానీ.. అందులో 60 శాతానికి మించి షేర్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.