ఛీ ఈ బతుకు, నాకీ రాజకీయాలు వద్దు - వైసీపీ ఎమ్మెల్యే

September 22, 2020

కోట్లు గుమ్మరించి ఎమ్మెల్యే అవ్వాలని అందరూ తపిస్తున్న రోజులవి. కానీ ఓ ఎమ్మెల్యే అది కూడా వైసీపీ ఎమ్మెల్యే ... ఛీ నాకీ రాజకీయాలు వద్దు. ఇక నేను పోటీ చేయను అంటున్నారు. ఆయన అంత విసిగిపోయింది ప్రత్యర్థుల వల్ల అనుకుంటే పొరపాటే. ఆయనను హర్ట్ చేసింది సొంత కార్యకర్తలే. వైసీపీ కార్యకర్తల ధోరణితో ఆందోళన చెందిన నందికొట్కూరు ఎమ్మెల్యే తొగరు ఆర్థర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక తాను ఇకపై పోటీ చేయబోనని సంచలన వ్యాఖ్య చేశారు. 

ఏం జరిగింది?

జూపాడు మండలం బన్నూరు పర్యటనకు నందికొట్కూరు ఎమ్మెల్యే (వైసీపీ) ఆర్థర్ వచ్చారు. అయితే, ఆ విషయం వైసీపీ కార్యకర్తలకు తెలియదు. దీంతో వైసీపీ కార్యకర్తలకు కోపం వచ్చింది. మీకోసం తిరిగి ఓట్లు అడిగి గెలిపించాం. కానీ మీరేమో మాకు సమాచారం లేకుండా, చెప్పకుండా వచ్చి మాకు ఇక్కడ విలువ లేకుండా చేస్తున్నారు. మాకు ఎందుకు చెప్పలేదు అని నిలదీశారు. దీంతో ఆయన హర్ట్ అయ్యారు. నేను ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను. నాకర్థమయ్యింది. ఇంకోసారి ఓట్లు అడుక్కోను. అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయను అని సంచలన ప్రకటన చేశారు. కార్యకర్తలు వచ్చినా, రాకపోయినా... వాళ్ల కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకేదయినా పనుంటే కార్యకర్తలే నా దగ్గరకు రావచ్చు. తాను ఏదో చెయ్యాలని ఎమ్మెల్యేను అయ్యాను. అదంతా జరగదని అర్థమైపోయింది నాకు అంటూ తీవ్ర అసంతృప్తి ప్రదర్శించారు ఆర్థర్. 

ఈ ఆర్థర్ ఎవరు?

తొగురు ఆర్థర్ ది కర్నూలు జిల్లా. కర్నూలు డిగ్రీ కాలేజీ విద్యార్థి. పోలీసు డిపార్ట్ మెంట్ ఉద్యోగి. ఏపీ పోలీస్ శాఖ లో కమాండెంట్ స్థాయిలో పనిచేశారు. వైఎస్ హయాంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్ గా పనిచేశారు. అప్పట్లో వైఎస్ తో ఉన్న పరిచయం కారణంగా, ఆయన విధానాలకు ఆకర్షితులయ్యారు. తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు ఉద్యోగం మానేసి టికెట్ కోసం ట్రై చేసి విఫలమయ్యారు. 2019లో జగన్ టిక్కెట్ ఇచ్చారు. 40 వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై గెలిచారు.