రివ్యూ: ఇస్మార్ట్ శంక‌ర్

September 24, 2020

సినిమా పేరు: ఇస్మార్ట్ శంక‌ర్
విభాగం: మాస్.. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్
న‌టీన‌టులు: రామ్.. నిధి అగ‌ర్వాల్.. న‌భా న‌టేష్.. షియాజీ షిండే త‌దిత‌రులు
సంగీతం: మ‌ణిశ‌ర్మ‌
ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌
నిర్మాత‌: పూరి జ‌గ‌న్నాథ్.. చార్మీ
సెన్సార్ స‌ర్టిఫికేట్‌: ఎ
నిడివి: 140 నిమిషాలు

వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఒకే ప‌డ‌వ‌లో ప్ర‌యాణిస్తూ.. ఎలా అయినా విజ‌యాన్ని సొంతం చేసుకోవాల‌న్న క‌సితో క‌లిసిన కాంబినేష‌న్ హీరో రామ్.. ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌. వ‌రుస‌గా ఆరు ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న పూరీ.. మూడేళ్లుగా స‌రైన హిట్ లేక విజ‌యం కోసం ఆవురావుర‌మంటున్న వీరిద్ద‌రూ క‌లిసి.. డిఫ‌రెంట్ గా ట్రై చేద్దామ‌నుకొని చేసిన సినిమాగా ఇస్మార్ట్ శంక‌ర్ ను చెబుతున్నారు. దీనికి తోడు..రామ్ గెట‌ప్.. ఈ సినిమా కోసం అత‌గాడు త‌న బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మార్చుకోవ‌ట‌మే కాదు.. విప‌రీతంగా శ్ర‌మించిన వైనంతో ఈ సినిమా మీద అంచ‌నాలు పెరిగాయి.
దీనికి తోడు ఫ‌స్ట్ లుక్ మొద‌లు.. టీజ‌ర్.. ట్రైల‌ర్.. ఇలా సినిమా రిలీజ్ కు ముందు ఈ సినిమాకు సంబంధించి బ‌య‌ట‌కు వ‌చ్చినవ‌న్నీ సినిమా మీద పాజిటివ్ బ‌జ్ కు కార‌ణమయ్యాయి. మ‌రి.. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు ఇస్మార్ట్ శంక‌ర్ ఉన్నాడా? వారి క‌ష్టం ఎంత‌మేర ఫ‌లించింది? అన్న వివ‌రాల్లోకి వెళితే..
క‌థ‌:
హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో సెటిల్ మెంట్లు చేసే కుర్రాడు శంక‌ర్ (రామ్). చిన్న చిన్న సెటిల్ మెంట్లు చేసే శంక‌ర్ కు త‌న జీవితం మొత్తం మారిపోయే భారీ డీల్ ఒక‌టి వ‌స్తుంది. ఒక‌రిని చంపే కాంట్రాక్ట్ అది. అలా ప‌రిచ‌య‌మ‌వుతుంది చాందిని (న‌భా న‌టేష్). ఆమె ప్రేమ‌లో ప‌డ‌తాడు. అదే స‌మ‌యంలో రాజ‌కీయ నాయ‌కుడు కాశీరెడ్డిని చంపిన కేసులో జైలుకు వెళ‌తాడు శంక‌ర్. అయితే.. అక్క‌డ నుంచి త‌ప్పించుకుంటాడు. అలా బ‌య‌ట‌ప‌డిన శంక‌ర్ మెద‌డులోకి మ‌రో వ్య‌క్తి మెమ‌రీస్ ను ట్రాన్స్ ప్లాంట్ చేస్తుంది సైంటిస్ట్ పింకీ (నిధి అగ‌ర్వాల్)
అస‌లు వేరే వారి జ్ఞాప‌కాల్ని శంక‌ర్ మెద‌డులో ఎందుకు ఇంప్లాంట్ చేస్తారు? రాజ‌కీయ నాయ‌కుడు కాశీరెడ్డిని శంక‌రే చంపాడా? అత‌డికి.. సీబీఐ అధికారి అరుణ్ (స‌త్య‌దేవ్‌)కు ఉన్న లింకేమిటి? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవ‌రెలా చేశారు
స‌రికొత్త మేకోవ‌ర్. అంత‌కు మించిన బాడీ లాంగ్వేజ్. తెలంగాణ యాస‌తో ఉండే డైలాగ్ డెల‌వ‌రీతో శంక‌ర్ గా వ‌చ్చిన రామ్ త‌న మేన‌రిజ‌మ్ తో.. డిఫెరెంట్ స్టైల్ తో ఆక‌ట్టుకుంటాడు. సినిమా మొత్తాన్ని అన్నీ తానై మోసాడు. తెలంగాణ యాస‌లో డైలాగులు చెప్పే విష‌యంలో మ‌రికాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది. అయిన‌ప్ప‌టికీ.. అత‌డి శ్ర‌మ‌ను త‌క్కువ చేయ‌లేం. మాస్ పాత్ర‌ల్ని ఇర‌గ‌దీసే రామ్‌.. ఈ సినిమాకు ప్ల‌స్సే త‌ప్పించి మైన‌స్ కాదు. సిక్స్ ప్యాక్ ప్ర‌ద‌ర్శ‌న‌.. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ఆక‌ట్టుకునేలా చేశాడు.
హీరోయిన్లు న‌భా.. నిధిలు అందాల ఆర‌బోత విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఒక‌రితో మ‌రొక‌రు పోటీ ప‌డిన చందంగా త‌మ ప‌రిధి మేర‌కు చెల‌రేగిపోయారు. సీబీఐ అధికారిగా న‌టించిన స‌త్య‌దేశ్ తెర మీద కాసేపు క‌నిపించినా గుర్తుండిపోతాడు. ఇక‌.. మిగిలిన‌పాత్ర‌ల్లోని వారంతా త‌మ ప‌రిధి మేర‌కు న‌టించారు. ఎవ‌రిని త‌క్కువగా చెప్ప‌లేం.
సినిమా ఎలా ఉందంటే?
ఈ సినిమాకు సంబంధించి మొద‌ట్నించి జ‌రిగిన ప్రచారం తెలిసిందే. జ్ఞాప‌కాల్ని ట్రాన్స్ ఫ్లాంట్ చేయ‌టం.. లాంటి కొత్త కాన్సెప్ట్ పై బోలెండ‌త ఆస‌క్తి వ్య‌క్త‌మైంది. సినిమా స్టార్టింగ్ లో కొన్ని స‌న్నివేశాలు ఆస‌క్తిని రేకెత్తించినా.. ఆ టెంపోను కొన‌సాగించ‌లేక‌పోవ‌టం కాస్తంత నిరాశ‌ను క‌లిగించేదే.
క‌థ‌ కొత్త‌గా ఉన్నా.. క‌థ‌నం ద‌గ్గ‌ర రోటీన్ గా ఉండ‌టంతో సినిమా మీద ఉన్న అంచ‌నాల‌కు చేరుకోని రీతిలో ఉంటుంది. నిరాశ‌ క‌లిగించే అంశం ఏమంటే.. పూరీ త‌న మూస ఫార్ములా పూర్తిగా బ‌య‌ట‌ప‌డలేద‌నే చెప్పాలి. మాస్.. యూత్ ను ఆక‌ట్టుకునే అంశాలు ఉన్నా.. ఇటీవ‌ల వ‌స్తున్న ప్ర‌యోగాత్మ‌క సినిమాల్లో ఉంటున్న ఫీల్.. ఎగ్జైంట్ మెంట్ మాత్రం మిస్ అయిన ప‌రిస్థితి. టేకింగ్ విష‌యంలో పూరిని వంక పెట్టేందుకు ఏమీ లేదు.
మ‌ణిశ‌ర్మ సంగీతం సినిమాకు ప్ర‌ధాన‌బ‌లం. సినిమాల్లోని లోపాల్ని కాస్త క‌వ‌ర్ చేయ‌గ‌లిగింది. త‌న మ్యూజిక్ తో సినిమాకు బ‌లంగా మారాడు. పాట‌లు బాగున్నా.. క‌థ‌లో చొప్పించిన‌ట్లుగా ఉండ‌టం ఇబ్బంది క‌లిగించేదే. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. సినిమాటోగ్ర‌ఫీకి ఫుల్ మార్కులు వేయాల్సిందే. ఆస‌క్తిక‌రంగా సినిమాను స్టార్ట్ చేసినా.. పాత్ర‌ల్ని ఫ‌స్ట్ ఆఫ్ లోనే రివీల్ చేయ‌టంతో ఇంట‌ర్వెల్ బ్యాంగ్ అంత‌గా కిక్ ఇవ్వ‌దు. రెండో భాగంలో ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యం స‌గ‌టు ప్రేక్ష‌కుడు సైతం అంచ‌నా వేయ‌గ‌లుగుతాడు. త‌న పాత సినిమాల్లో మాదిరి పూరి సినిమాను చుట్టేసిన ఫీలింగ్ చివ‌ర్లో క‌లగ‌టం పెద్ద మైన‌స్ గా చెప్పాలి.
సినిమాను చూడొచ్చా? అంటే.. మాస్.. యాక్ష‌న్ సినిమాలంటే ఇష్ట‌ప‌డే వారికి ఇస్మార్ట్ శంక‌ర్ ఓకే అవుతాడు. మిగిలిన వారికి మాత్రం కండీష‌న్లు అప్లై అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ సినిమా ప్లుస్సులు ఏంటి:

రామ్ నటన
మాస్ ఎలిమెంట్స్
పూరీ డైలాగ్స్
మ‌ణిశ‌ర్మ మ్యూజిక్

కంక్లూజన్- పూరీ హై డోస్ డైలాగులు బాగానే పండాయి కాబట్టి ఈ సినిమా రెకమెండెండ్ ! మిగతా వన్నీ మర్చిపోండి. రామ్ ఎక్సెప్షనల్ !!

రేటింగ్: 2.5/5

 

గ‌మ‌నిక‌: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి దృష్టి కోణంలోనిది. పూర్తిగా వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే.