జగన్ టీం: 19 మందిలో ‘పని’కొచ్చేది నలుగురే

September 22, 2020

లక్షల్లో జీతాలు.. కేబినెట్‌ ర్యాంకు, కూర్చోడానికి కనీసం కుర్చీల్లేవు
అక్కరకు రాని అడ్వైజర్లు.. 19 మందిలో ‘పని’కొచ్చేది నలుగురే

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పోనీ ఐదుగురైనా కాదు.. ఏకంగా 19 మంది సలహాదార్లు ఆంధ్రప్రదేశ్‌పై అజమాయిషీ చేస్తున్నారు. అవసరం ఉన్నా.. లేకున్నా సీఎం జగన్మోహన్‌రెడ్డి తనకు వీరందరినీ అడ్వైజర్లుగా పెట్టుకున్నారు. వీరిలో పది మందికి కేబినెట్‌ మంత్రి హోదా కట్టబెట్టారు. జీతభత్యాల కింద ప్రతి నెలా సుమారుగా రూ.4 లక్షలు పుచ్చుకుంటున్నారు. ప్రోటోకాల్‌ మర్యాదలు సరేసరి. వీరిలో కొందరు మన రాష్ట్రానికి చెందినవారే కాదు. కులం.. మతం.. తనవారు.. పునరావాసం.. మొహమాటం.. ఇత్యాది కేటగిరీల కింద జగన్‌ వారిని అమరావతికి తీసుకొచ్చారు. వీరిలో కొందరు ఆయా రంగాల్లో నిష్ణాతులే అయినా.. వారు ఏం సలహాలిస్తున్నారో.. వాటిని పాటించే వారెవరో ఎవరికీ అర్థం కావడం లేదు. జగన్‌ ఎవరి మాటా వినరు. తాను చెప్పినట్లు పాలసీలు, స్కీంలు ఉండాలి తప్ప.. వాటికి అనుగుణంగా ఆయన నడవరు. ఒకవేళ ఎవరైనా చొరవతో ఆయా శాఖలకు సలహాలిచ్చినా.. వినే నాథుడే లేడు. ఎందుకంటే అంతా జగనే చూసుకుంటాడన్నది మంత్రుల ఉద్దేశం. నిజానికి జరుగుతున్నదీ అదే. వారిపై నిరంతర నిఘా ఉంటుంది. చివరకు బాత్రూంకు ఎన్ని సార్లు వెళ్తున్నారో కూడా చెప్పేంత స్థాయిలో వారిపై ఎక్కడికక్కడ ఆంక్షలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అడ్వైజర్లు ఏం చెప్పినా వారికి పట్టదు.
పనిచేసేది ఎవరు?
18 మంది సలహాదార్లలో పట్టుమని పనిచేస్తున్నది నలుగురే. సీఎంకు ముఖ్య సలహాదారు అజేయ కల్లం.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఈయన.. ఇప్పుడు పరిపాలనలో కీలక సలహాలు ఇస్తున్నారట! మరి జగన్‌ వాటిని ఎంతవరకు పాటిస్తున్నారో గాని.. త్వరగా ఈ బాధ్యతలు వదిలించుకోవాలని ఆయన చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కేంద్రం మాట పెడిచెవిన పెట్టి పీపీఏల రద్దుకు జగన్‌ సాహసించారు. వద్దు వద్దంటూ కేంద్ర ఇంధన మంత్రి ఎన్నో సార్లు లేఖలు రాశారు. చివరకు జాతీయ విద్యుత ఎక్స్ఛేంజ్‌లో ఆంధ్రకు కరెంటు విక్రయించకుండా నిషేధం విధించే స్థితి తెచ్చుకున్నారు. దీనిప్రభావం దేశమంతా పడింది. సౌర, పవన విద్యుతతో పాటు మరే రంగాల్లోనూ పెట్టుబడులకు సంస్థలు, జాయింట్‌ వెంచర్లు ముందుకు రావడం లేదు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, ఏఐఐబీలాంటివి కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ససేమిరా అంటున్నాయి. దీని నుంచి ఎలా బయటపడాలో అజేయ కల్లంలాంటి సీనియర్‌ అధికారికే పాలుపోవడం లేదు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజావ్యవహారాల సలహాదారుగా ఉన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా కేవీపీ రామచంద్రరావు ఇదే పోస్టులో ఉండేవారు. ప్రతిపక్షాల నుంచి ఫిరాయింపులు, పోలీసులను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం.. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసే వైసీసీ శ్రేణులకు అండగా నిలవడం.. ఎదురుకేసులు బనాయించడం వంటివి ఈయన బాధ్యతలు. పైగా సీఎంకు రాజకీయ సలహాదారు కూడా. వైసీపీ మీడియా విభాగం అధిపతిగా ఉన్న జీవీడీ కృష్ణమోహన్‌ రాష్ట్రప్రభుత్వ కమ్యూనికేషన్‌ సలహాదారుగా నియమితులయ్యారు. జగన్‌ మాట్లాడే ప్రతి మాటా.. ఆయా పథకాల ప్రారంభోత్సవాల్లో చేసే ప్రసంగాలన్నీ ఈయనే రాస్తారు. పీటర్‌ హసన్‌ రోడ్లు భవనాల శాఖ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌. ఆయన్ను పరిశ్రమల ప్రమోషన్‌, ఎక్స్‌టర్నల్‌ వ్యవహారాల సలహాదారుగా నియమించడం విచిత్రమైతే.. ఆయనకు ఏ మాత్రం పరిచయం లేని నీటిపారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టులు, పనుల తీరును పరిశీలించే కమిటీకి చైర్మన్‌గా నియమించడం మరీ విడ్డూరం. ఒప్పందాలపై రంధ్రాన్వేషణ చేసి.. ఉన్న కాంట్రాక్టర్లను తీసివేసి.. తమకు కావలసినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు జగన్‌ తలపెట్టిన రివర్స్‌ టెండరింగ్‌కు మార్గం సుగమం చేయడమే ఆయన బాధ్యత. పోలవరం, బందర్‌ పోర్టు కాంట్రాక్టులను ఇలాగే రద్దుచేశారు. ఇక మిగతా సలహాదారుల్లో ఇద్దరు.. శామ్యూల్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు. శామ్యూల్‌ (నవరత్నాలు), వెంకట రమణి భాస్కర్‌ (ఆర్థికం, వనరులు). కృష్ణమోహన్‌ రాష్ట్ర మీడియా సలహాదారు కాగా.. సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సీనియర్‌ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తిని పబ్లిక్‌ పాలసీ సలహాదారుగా తీసుకున్నారు. ఇక మరో సీనియర్‌ జర్నలిస్టు దేవులపల్లి అమర్‌ జాతీయ మీడియా సలహాదారు. ఈ ముగ్గురూ తెలంగాణ ప్రాంతం వారు కావడం గమనార్హం. గల్ఫ్‌ దేశాలతో రాష్ట్ర పారిశ్రామిక సంబంధ బాంధవ్యాలు నెలకొల్పేందుకు జుల్ఫీ రావ్‌జీకి కేబినెట్‌ ర్యాంకు ఇచ్చి మరీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. రస్‌-అల్‌-ఖైమా వ్యవహారం గుర్తుంది కదా! విశాఖలో బాక్సైట్‌, గుంటూరు-ప్రకాశం జిల్లాలో వాన్‌పిక్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడుల కోసం వచ్చిన సంస్థ. జగన్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌లకు బినామీగా ఉండేందుకు అప్పట్లో దానిని తీసుకొచ్చింది రావ్‌జీయే! ఆ కృతజ్ఞతతో జగన్‌ మళ్లీ ఆయన్ను తెచ్చుకున్నారు. పరిశ్రమల ప్రోత్సాహానికి సాంకేతిక నిపుణుడు కృష్ణా జి.వి.గిరిని సలహాదారుగా నియమించారు. తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంరెడ్డి భార్య శిల్పా చేకుపల్లిని ఆరోగ్య సలహాదారు (ఏపీ భవన్‌, న్యూఢిల్లీ)గా తీసుకున్నారు. తెలంగాణకు చెందిన ఆమెను రాష్ట్రానికి కాకుండా కేవలం ఏపీ భవన్‌కు సలహాదారుగా నియమించడంలోని ఆంతర్యమేంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. చంద్రబాబు హయాంలో వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమితులైన మాజీ అధికారి విజయ్‌కుమార్‌ను జగన్‌ కూడా కొనసాగిస్తుండడం గమనార్హం. ఇక వెంకట్‌ ఎస్‌ మేడపాటి (ఏపీఎన్‌ఆర్‌టీ), తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి (టెక్నికల్‌ ప్రాజెక్టులు), విద్యాసాగర్‌రెడ్డి (ఐటీ టెక్నికల్‌), లంకా శ్రీధర్‌ (మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు), సాగి దుర్గాప్రసాదరాజు (సమన్వయం), తలశిల రఘురాం (కార్యక్రమాల కోఆర్డినేటర్‌) పూర్తిగా వైసీపీ నేతలు. పార్టీ పనిచేసుకునేవారిని సలహాదార్లుగా తీసుకుని ప్రభుత్వ నిధులను దోచిపెడుతున్నారని విమర్శలు వస్తున్నా లెక్కచేసేవారే లేరు. ఇలా వైసీపీ హయాంలో సలహాదారుల నియామకాలు ప్రహసనంగా మారాయి.  
నచ్చిన వారిని.. రాష్ట్రంతో సంబంధం లేని వారిని ఏరికోరి తెచ్చుకున్నారు. వీరితో రాష్ట్రానికి లాభం మాట తర్వాత.. ఖజానాకు మాత్రం చిల్లు పడుతోంది. ఓపక్క చంద్రబాబు ఖజానాను ఖాళీ చేశారని, ఐదేళ్లలో అప్పులు, వడ్డీలు తప్ప ఏమి మిగల్చలేదని తిడుతూనే సలహాదారులకు అప్పనంగా లక్షలు లక్షలు చెల్లించడం ఏమిటి? రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవని.. అసలు అమరావతి నిర్మాణమే అక్కర్లేదని గగ్గోలు పెడుతూ.. ఖాళీ ఖజానాపై మరింత భారం మోపుతున్నారు. పైగా వీరితో వీసమెత్తు లాభం ఒనగూరదు. వేతనాలు తీసుకోవడం తప్ప జగన్‌  వద్ద సమస్యలు ప్రస్తావించే ధైర్యం వారికి లేదు. ఎవరైనా ధైర్యం చేసినా.. వారి చోటు వారికి చూపిస్తుంటారు. జగన్‌ కేబినెట్‌లో 25 మంది మంత్రులున్నారు. వీరి సంఖ్యకు పోటాపోటీగా సలహాదారులూ ఉన్నారు. ఇంతమంది అడ్వైజర్లు కూర్చోవడానికి సచివాలయంలో కనీసం చాంబర్లు కూడా లేవు. కుర్చీలూ కరువే. పని చేయించకుండా కూర్చోబెట్టి జీతాలిచ్చే వారిని చూశాం. కానీ వీరికి కూర్చునే అవసరం లేకుండానే వేతనాలందుతున్నాయి. కొందరు హైదరాబాద్‌ వదిలి రావడమే లేదు. ప్రజలు బంపర్‌ మెజారిటీ ఇచ్చింది తనవారిని కూర్చోబెట్టి మేపడానికే అన్నట్లుగా జగన్‌ వ్యవహార శైలి ఉంది.