బాబుకు కుల‌పిచ్చి ఉందా..??

September 24, 2020

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏపీ రాజ‌ధాని నిర్మాణం. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఈ విష‌యంలో ప‌లువురు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. కొంద‌రు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రు ఆందోళ‌న చేస్తున్నారు. ఇంకొంద‌రు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. వీట‌న్నింటినీ క‌ల‌గ‌లిపి మాట్లాడారు సినీ న‌టుడు శివాజీ. గ‌త కొద్దికాలంగా తెర‌మ‌రుగైన ఈ న‌టుడు తాజాగా ఓ చానల్‌తో మాట్లాడుతూ... సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తిపై అన్ని వ‌ర్గాల్లోనూ ఆందోళ‌న ఉంద‌ని...అయితే,  కేసుల భయంతోనే ప్రజలు ముందుకొచ్చి పోరాడటం లేదన్నారు.
ముఖ్య‌మంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నారని ఇప్పుడు అమ‌లు చేస్తున్నార‌ని శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అస‌లైన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ అని అన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ గురించి అధికార పార్టీ విమ‌ర్శ‌లు చేసే బ‌దులుగా, అలాంటిది జరిగితే టీడీపీ నేతలను జైలులో పెట్టండని శివాజీ స‌వాల్ విసిరారు. ఎన్నికల్లో ఖ‌ర్చు పెట్టిన డబ్బును తిరిగి సంపాదించుకునేందుకే రాజధాని మార్పు చేస్తున్నారని శివాజీ ఆరోపించారు.
చంద్రబాబుకు కుల పిచ్చి అన్న‌ది ఓ ఆరోప‌ణ మాత్ర‌మేన‌ని శివాజి తెలిపారు. బాబుకు ఆ ఫీలింగ్ ఉంటే కమ్మవాళ్లున్న చోటే కియా మోటార్స్‌ పెట్టేవాళ్లు కదా? అని శివాజీ ప్రశ్నించారు.  చంద్ర‌బాబుపై కుల‌పిచ్చి ముద్ర వేసి రాజధాని త‌ర‌లించాల‌ని చూస్తున్నార‌ని, అయితే ఇప్పటికే రూ.10వేల కోట్లు ఖర్చు పెట్టిన నేప‌థ్యంలో ఆ నిధులు ఏం చేయాలో ఆలోచించుకోవాల‌న్నారు.  విశాఖలో వెయ్యి ఎకరాలు కూడా భూసేకరణ చేయలేరని, రాజధానితో విశాఖకు కూడా లాభమేమీ లేదని అన్నారు. అమరావతిని జగన్ కొనసాగించక‌పోవ‌డంపై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంద‌ని అయితే, కేసులు కార‌ణంగా రోడ్డెక్క‌డం లేద‌న్నారు. తెలంగాణ ఉద్య‌మం స్ఫూర్తితో ఏపీ భ‌విష్య‌త్ కోస‌మైనా ప్ర‌జ‌లు ఆందోళ‌న‌ల్లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు.