జగన్ గూఢాచర్యం - జనం డేటాపై కూపీ

September 23, 2020

ఏపీలో జగన్ ప్రభుత్వం తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అన్నది తెలుసుకోవడం కోసం చేపడుతున్న సర్వే పత్రాల్లో అడుగుతున్న ప్రశ్నలు ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. అమ్మఒడి, రైతు భరోసా వంటి పథకాలు అందాయా లేదా అన్నది తెలుసుకోవడంతో పాటు పొలాలు, పశుసంపద ఎంత ఉందన్న సమాచారం కూడా తెలుసుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉంటే వారి వివరాలు అడుగుతున్నారు.
ఈ సర్వే పత్రాల్లో ప్రభత్వ పథకాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఎంత చోటిచ్చారో విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న కుటుంబ సభ్యుల వివరాల కోసం అన్ని ప్రశ్నలు వేసి అంత స్థలం కేటాయించారు. ఇతర రాష్ట్రాలు, లేదా విదేశాల్లో ఉంటున్న కుటుంబ సభ్యుల పేర్లు, వారు అక్కడ ఏం చేస్తున్నారు.. ఉద్యోగమైతే ఏ సంస్థలో పనిచేస్తున్నారు వంటి వివరాలన్నీ అడుగుతున్నారు. అంతేకాదు, వారి ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలతో పాటు వాట్సాప్ కోసం వినియోగిస్తున్న ఫోన్ నంబరు, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు నింపమంటూ ఖాళీలిచ్చారు.
పథకాల అమలుపై సర్వే పేరుతో ప్రవాసాంధ్రుల వ్యక్తిగత వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వం ఎందుకు కోరుకుంటోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా సేకరించిన సమాచారంతో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది.. ఎన్నికల ప్రచారంలో వాడుకోవాలనుకుంటుందా, లేదంటే ఇంకేమైనా ఉద్దేశముందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న తమవారి వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వానికి ఇస్తే వారి వ్యక్తిగత డాటా భద్రత ప్రశ్నార్థకం కాదా అన్న అనుమానాలూ వ్యక్తవుతున్నాయి.