బాబు హోదా తగ్గించడం జగన్ తరం కాదంతే

September 21, 2020

తెలుగు నేల రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ 4 దశాబ్దాల అనుభవం కలిగిన నేతగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఓ రేంజి రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. 40 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు ఎత్తులు తెలుసు, పల్లాలూ తెలుసు. విజయాలు చూశారు. పరాజయాలూ చూశారు. అయినా టీడీపీని దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా మార్చడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పక తప్పదు. అలాంటి చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూస్తే... చంద్రబాబుకు దక్కిన ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను తీసేస్తానంటూ నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన జగన్ పలికిన పలుకులు చూసి జనం నివ్వెరపోయారు.

సరే... అధికారంలో ఉన్న జగన్ ఏమైనా చేయగలరేమో అని కూడా చాలా మంది భావించారు. జగన్ కూడా తాను అనుకున్నట్లుగా చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను తొలగించే దిశగా తనదైన కుయుక్తులు పన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం అసెంబ్లీలో 18 మందికి పైగా సభ్యులుంటేనే టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కిపోతుంది. అయితే టీడీపీకి ఇప్పుడు సభలో 23 మంది సభ్యులున్నారు కదా. వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను తమ వైపునకు లాగేసుకున్న జగన్... టీడీపీ బలాన్ని 22కు కుదించారు. జగన్ ఆశ నెరవేరాలంటే... ఇంకో ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడాలి. అందులో భాగంగా తన కేబినెట్ లో మంత్రిగా ఉన్న తన మామ బాలినేని శ్రీనివాసరెడ్డిని జగన్ రంగంలోకి దింపారు. ఇంకేముంది సీఎం అల్లుడు ఇచ్చిన ప్రోత్సాహంతో రంగంలోకి దిగిపోయిన బాలినేని... తన జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న నలుగురు నేతలతో టచ్ లోకి వెళ్లారు.

టీడీపీని వీడితే ఎన్నెన్నో చేస్తామని, అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తామని చెప్పి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలను లాగే యత్నం చేశారు. బాలినేని ఫోన్లను టీడీపీ ఎమ్మెల్యేలు కాస్తంత మాట్లాడగానే ఇక బాబు పని అయిపోయిందని ప్రచారం చేసుకున్నారు. తీరా అసెంబ్లీ సమావేశాలకు సమయం ఆసన్నమవుతుండగా... బాలినేని మాట్లాడిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, జీబీవీ స్వామి వైసీపీకి షాకిచ్చారు. జీబీవీ స్వామిని పక్కనపెడితే... మిగిలిన ముగ్గురిని ఎలాగైనా లాగేందుకు బాలినేని తనదైన శైలి యత్నాలు చేశారు. అయితే ప్లాన్ పారలేదు. ఇలా వైసీపీ ప్రతిపాదించిన ఆఫర్లకు టీడీపీ ఎమ్మెల్యేలు పడకపోగా.... సానుకూలంగా స్పందించినట్లు నటించి ఆ తర్వాత షాకిచ్చారు. దీంతో బాబుకు దెబ్బేద్దామని యత్నించిన జగన్ కు ఎదురు దెబ్బపడిందన్న మాట.