జగన్ ప్రభుత్వం చాపకింద నీరులా ఆ పని చేస్తుందా?

September 21, 2020

ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని జిల్లాల్ని పునర్విభజించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ శాసనమండలిలో చెప్పడంతో మరోసారి ఈ అంశం ప్రస్తావనకొస్తోంది. శాసన మండలిలో శుక్రవారం బీజేపీ సభ్యుడు పీవీఎన్‌ మాధవ్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ఈ అంశంపై ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి చెప్పారు.
కాగా పొరుగు రాష్ట్రం తెలంగాణలో జిల్లాల పునర్విభజనతో టీఆరెస్ రాజకీయంగా లాభపడినా పాలనా పరంగా అనుకున్న మార్పులేవీ రాకపోగా కొత్తగా అనేక తలనొప్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో ఇలాంటి ఆలోచన నుంచి ప్రభుత్వం వెనక్కు మళ్లిందని అంతా భావించారు. కానీ, తాజాగా మంత్రి మరోసారి ఈ విషయం మండలి వేదికగా చెప్పడంతో జిల్లాల్లో రాజకీయంగా చర్చనీయమవుతోంది.
ఇంతకుముందు కూడా ప్రభుత్వం ఈ దిశగా చర్యలు ప్రారంభించిందని తెలియగానే పలు జిల్లాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో కొన్ని మరింతగా నష్టపోతాయంటూ ఆందోళనలు మొదలయ్యాయి. అయితే.. ప్రభుత్వం జిల్లాల విభజనపై సీరియస్‌గా లేకపోవడంతో అవన్నీ చల్లబడ్డాయి. కానీ, ఇప్పుడు మంత్రి మరోసారి చెప్పడంతో ప్రభుత్వం చాపకింద నీరులా జిల్లాల విభజన దిశగా కదులుతోందన్న అనుమానాలు మొదలయ్యాయి.