బీజేపీ బూబీ ట్రాప్‌లో జ‌గ‌న్‌

September 21, 2020

బూబీ ట్రాప్ అంటే మ‌న‌కు పెద్ద‌గా అర్థంకాదు కానీ..ఉచ్చు ప‌న్న‌డం అంటే ఇట్టే అర్థం అయిపోతుంది. ప్ర‌స్తుతం బీజేపీ ప‌న్నిన ఉచ్చు(బూబీట్రాప్‌)లో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ పూర్తిగా ఇరుక్కుపోయాడు. బీజేపీ గేమ్ చాలా చాలా విభిన్నంగా ఉంటుంది. త‌న ప్ర‌త్య‌ర్థిని హ‌త్య చేయ‌దు..ఆత్మ‌హ‌త్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. జ‌గ‌న్ విష‌యంలోనూ ఇదే చేస్తోంది. మూడు రాజ‌ధానులు ప్ర‌క‌ట‌న‌, సీఆర్డీఏ ర‌ద్దు, శాస‌న‌మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యాల‌న్నీ బీజేపీ ఓకే చెప్పినాకే జ‌గ‌న్ అమ‌లుకు దిగారు. అయితే ఈ విష‌యాల్ని బీజేపీ నేత‌లే రెండు గ్రూపులుగా మారిపోయి ఒక‌రు ఖండిస్తుంటారు. మ‌రొక‌రు స‌మ‌ర్థిస్తుంటారు. ఇదే అస‌లైన బీజేపీ మార్క్ గేమ్‌.

ఒక‌ప్ప‌టి మిత్రుడు చంద్ర‌బాబు శ‌త్రువుగా మార‌డంతో ఆయ‌న శ‌త్రువు అయిన జ‌గ‌న్ ని చేర‌దీసింది బీజేపీ. తెలుగుదేశం పార్టీని ఘోరంగా ఓడించి త‌మ‌కు బ‌లంలేని చోట్ల కూడా ఎదిరిస్తే ఏం జరుగుతుందో శాంపిల్ చూడాల‌ని చంద్ర‌బాబుకు రుచిచూపించింది. చంద్ర‌బాబును దింపేందుకు త‌ప్పించి జ‌గ‌న్‌ని ఒక పావుగా వాడుకున్నారు త‌ప్పించి వైఎస్ జ‌గ‌న్ క‌మ‌ల‌నాథుల‌కు అంత విశ్వ‌స‌నీయ‌మైన మిత్రుడేం కాదు. కేసీఆర్‌తో స్నేహం వ‌ల్ల‌నైతేనేమి, క్రిస్టియ‌న్ అయిన జ‌గ‌న్ హిందూ మ‌త వ్య‌తిరేక చ‌ర్య‌ల వ‌ల్ల‌నైతేనేమి గానీ చంద్ర‌బాబు కంటే జ‌గ‌నే బీజేపీ ఎక్కువ శ‌త్రువు. అయితే జ‌గ‌న్ ప‌ట్ల ఎక్క‌డా ద్వేషం క‌న‌ప‌ర‌చ‌కుండా, ఈడీ సీబీఐ కేసుల‌ను త‌మ గుప్పిట్లో ఉంచుకుని తోలుబొమ్మ లెక్క ఆడిస్తోంది బీజేపీ. అసాధ్య‌మైన 151 సీట్లు సాధించిన వైకాపా అధినేత జ‌గ‌న్‌ని క్షేత్ర‌స్థాయిలో ఎదుర్కొనే ప్ర‌జాబ‌లం బీజేపీకి లేదు. అయితే బీజేపీ ఏం చేయ‌గ‌ల‌దో అదే చేస్తోంది. ప్ర‌త్య‌ర్థి బ‌ల‌వంతుడు..వాడిని హ‌త్య చేయ‌లేం..అందుకే ప‌రిస్థితుల్ని దుర్భ‌రంగా మార్చి ప్ర‌త్య‌ర్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డేలా చేసే ప‌థ‌క‌మే ఈ బూబీ ట్రాప్‌. ఇది ప‌క‌డ్బందీగా క‌మ‌ల‌నాథులు ప‌న్నిన ఉచ్చు. ఇందులో ప‌డి జ‌గ‌న్ గిల‌గిలా కొంటుకుంటున్నారు.

ఇలాంటివే మ‌రికొన్ని నిర్ణ‌యాలు జ‌గ‌న్ తీసుకుని ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న అయ్యేలా చేయ‌డ‌మే బీజేపీ ల‌క్ష్యం. జ‌గ‌న్‌కి వేసిన ఉచ్చే టీడీపీకి బిగుసుకుంటుంద‌ని కాషాయ‌ధారులు విశ్వ‌సిస్తున్నారు. మూడురాజ‌ధానులు ఇటు జ‌గ‌న్‌కి, అటు చంద్ర‌బాబుకు ఒక్కొక్క‌రికీ ఒక్కో ప్రాంతంలో డ్యామేజ్ అయ్యే స్థితికి తీసుకొస్తారు. ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి దిశ‌గా సాగుతున్న ఏపీ న‌వ‌ర‌త్నాల అమ‌లుకే నానాపాట్లు ప‌డుతోంది. కేంద్రం సాయం త‌గ్గించేసి మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురిచేస్తారు.

ఈ ద‌శ‌లో జ‌గ‌న్ మ‌ర‌ణ‌మా? శ‌ర‌ణ‌మా? అనే దుస్థితికి తీసుకొస్తారు. స్వ‌త‌హాగా శ‌ర‌ణ‌మ‌నేందుకు జ‌గ‌న్ అహం ఒప్పుకోదు..అప్పుడు రాజ‌కీయాల్లో హ‌త్య‌లుండ‌వు..ఆత్మ‌హ‌త్య‌లే శ‌ర‌ణ్యం అవుతాయి. అప్పుడు ప‌వ‌న్‌ని పేక‌ల్లో జోక‌ర్లా వాడుకుని ఏపీలో అధికారం చేప‌ట్టి కూర‌లో క‌రివేపాకుని తీసిన‌ట్టు ప‌వ‌న్ తీసేసి త‌మ మార్కు కాషాయం పాల‌నవైపు న‌డిపిస్తారు.