గ్రామ సచివాలయ వ్యవస్థ అవసరమా జగన్... సీనియర్ క్వశ్చన్

September 25, 2020

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్లో అడుగడుగునా అనుభవ రాహిత్యం కనిపిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నాందెండ్ల భాస్కరరావు అన్నారు. ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ నిరుపయోగం అని ఆయన తేల్చేశారు. అది అనాలోచిత నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిర్ణయాల వల్లే జగన్ అనభవ రాహిత్యం బయటపడుతోందని నాదెండ్ల విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ చేపట్టిన సచివాలయ వ్యవస్థ అవసరమా? అంటూ నాదెండ్ల తీవ్ర వ్యాఖ్యలే చేశారు.  ప్రతి 3 వేల మంది ప్రజలకు 30 మంది ఉద్యోగులు అవసరం లేదన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వడానికి ఇప్పటికే దివాలా తీసిన ప్రభుత్వం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాలు, వైసిపి ప్రభుత్వ విధానం.. ప్రజలు ఇబ్బందులు పడేలా ఉంటున్నాయన్నారు.
ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలు చీదరించుకునేలా ఉండకూడదని నాదెండ్ల భాస్కరరావు పేర్కొన్నారు. కాగా నాదెండ్ల ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కొద్దికాలం కిందటే బీజేపీలో చేరిన ఆయన ఇంతవరకు ఎక్కడా పెద్దగా పార్టీ తరఫున మాట్లాడడం కానీ, వ్యక్తిగత హోదాలో మాట్లాడడం కానీ చేయలేదు. కానీ, ఇప్పుడు జగన్ పాలనపై ఆయన క్రిటికల్‌గా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరినీ ఆకర్షించాయి. గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి జగన్, వైసీపీ నేతలు జబ్బలు చరుచుకుంటున్న వేళ.. అందులో అవినీతిపైనే ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తున్న వేళ.. నాదెండ్ల ఏకంగా ఆ వ్యవస్థే అనవసరమని తేల్చేయడంతో వైసీపీ నేతలు కూడా ఎలా కౌంటర్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారట.