పాదయాత్ర టైంలో దీనికి జగన్ మ్యాప్ గీశాడట

September 24, 2020

ఏపీ సీఎం జగన్‌పై మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికంటూ రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన జగన్మోహనరెడ్డి అసలు లక్ష్యం అది కాదని... రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ భూములు కొల్లగొట్టడానికి అవకాశం ఉందో గుర్తించడానికి ఆయన పాదయాత్ర చేశారని చినరాజప్ప ఆరోపించారు. పాదయాత్ర చేస్తున్నప్పుడే భూములపై జగన్ కన్నేశారని ఆరోపించారు. అప్పుడు గుర్తించిన భూములను ఇప్పుడు అమ్మేందుకు పథకం పన్నారని విమర్శించారు.
కావాలనే ఇసుక కొరతను సృష్టించారని, ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని అన్నారు. 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే... కేవలం నలుగురికి మాత్రమే నష్టపరిహారం ప్రకటించారని దుయ్యబట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఇసుక రీచ్ లను న్యాయవాదులతో కలసి పరిశీలిస్తామని... ఆ తర్వాత ఇసుక లభ్యతపై జిల్లా కలెక్టర్ కు నివేదికను అందిస్తామని చినరాజప్ప తెలిపారు.
ఇటీవలి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహారంపైనా ఆయన స్పందించారు. అధికారులను బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండడం కరెక్టే కానీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేసిన తీరు సరికాదని అన్నారు. అమరావతి అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం కావాలనే వదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలు సరిగా లేవని, పాలనంతా అయోమయంగా ఉందని ఆయన ఆరోపించారు.