రైతులను బుట్టలో వేసుకునే ప్లాన్లో జగన్...

September 22, 2020

అమరావతిలోనే రాజధాని ఉండాలని రైతులు చేస్తున్న నిరసనకు కృష్ణా గుంటూరు జిల్లాలు కదిలిరాకపోవడాన్ని వైసీపీ అధినేత జగన్ గమనిస్తున్నారు. ఆ రెండు జిల్లాల ప్రజల్లో ఉన్న అనైక్యతను క్యాష్ చేసుకోవడానికి జగన్ వ్యూహం పన్నుతున్నట్టు అర్థమవుతోంది. రాజధాని మార్పు ప్రకటన చేసినప్పటి నుంచి తీవ్రంగా ఉద్యమిస్తున్నది రాజధాని రైతులు మాత్రమే. వారు తమకు జరిగిన అన్యాయంపై బోరుమంటున్నారు. ఇలాంటి సీన్ తెలంగాణలో కనిపించి ఉంటే ఈ పాటికి అది ఉద్యమ రూపం దాల్చేది. కానీ వ్యాపార థృక్పథం కలిగిన ఈ రెండు జిల్లాల ప్రజలు అమరావతి ఆందోళనను ఉద్యమంగా మార్చడంలో విఫలమయ్యారు. ఈ పాయింట్ ఆధారంగా జగన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు.

అమరావతి రైతులకు న్యాయం చేయడం ద్వారా వీరి ఆందోళనను ఆపేస్తే ఇక రాజధాని మార్పుపై వ్యతిరేకత ఉండదని జగన్ భావిస్తున్నారు. అందుకే రేపటి కేబినెట్లో రైతులను బుట్టలో వేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండొచ్చని తెలుస్తోంది. రైతుల చేత ఆందోళన విరమింపజేస్తే ఈ సమస్య ఇక్కడితో సమసిపోతుందన్న నేపథ్యంలో రైతులకు ఏ రూపేణా న్యాయం చేయాలి అన్నదానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది.

జగన్ యాక్షన్ ప్లాన్లో భాగంగా... అడిగిన రైతులకు అవకాశాన్ని బట్టి భూములు తిరిగి ఇవ్వడం ఒక ఎత్తు అయితే... భూములు తిరిగి ఇవ్వలేని పరిస్థితులు ఉన్న చోట కౌలు చెల్లిస్తూ మొత్తం భూమికి రేటు కట్టి ఇవ్వడం ఇంకో పని. అయితే, ప్రస్తుత బడ్జెట్ దానిక ిసహకరించదు. అందుకే గత ప్రభుత్వం ఎకరాకు పావు ఎకరా భూమి తిరిగిస్తామని చెప్పింది. దానిని అర ఎకరా చేయడం ద్వారా  రాజధాని తరలింపు వల్ల జరిగే మందగమన అభివృద్ధిని కంపెన్సేట్ చేయడం ఒకటి. మరోవైపు ఇప్పటికే అమరావతిలో ప్రముఖ విద్యాసంస్థలు నెలకొల్పారు. ముందు నుంచి కూడా విజయవాడ విద్యా కేంద్రం. కాబట్టి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడం సులువు. భూములు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్ది రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. 

ఇంకా ఏఏ విధంగా రైతులను శాంతింపజేసి ఆందోళనలు ఆపొచ్చనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఏదోవిధంగా రైతులను శాంతింపజేస్తే... ప్రతిపక్షాలను అణచివేయొచ్చనేది అధ్యయనం చేస్తున్నారు. ఈ విషయంలో జగన్ సక్సెస్ అయితే... ఇక రాజధానిని మరిచిపోవాల్సిందే.