జ‌గ‌న్ సెల్ఫ్‌గోల్‌... జాతీయ మీడియా ఇదే చెప్తోందిగా?

September 22, 2020

ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేసుకున్న సెల్ఫ్‌గోల్ వంటిద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని లెక్కలు చెప్తున్న సీఎం జగన్ పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటు చేయడం అనే నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, దీనిపై అన్నివ‌ర్గాల్లోనూ ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. టీడీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి బిల్లును సెల‌క్ట్ క‌మిటీకి పంపించింది. అసెంబ్లీలో అధికార పార్టీ బ‌లాన్ని కౌన్సిల్‌లో త‌మ ఎత్తుగ‌డ‌ల‌కు చెక్ పెట్టేసింది.
మ‌రోవైపు అసెంబ్లీ-శాస‌న‌మండ‌లి వేదిక‌గా  రెండురోజుల పాటు జ‌రిగిన‌ నరాలు తెగే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. జగన్ సర్కారు అసెంబ్లీలో ఆమోదం పొందిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీడీఏ ఉపసహరణ బిల్లును శాసనమండలి మోకాలడ్డింది. దానిని మండలి చైర్మన్ షరీఫ్ రూల్ 154 ప్రకారం.. సభ మెజారిటీని దృష్టిలో ఉంచుకుని, తన విచక్షణాధికారాలు వినియోగించి సెలక్ట్ కమిటీకి పంపించడం ద్వారా.. మరో మూడు నెలల పాటు రాజధాని ‘మూడు’ మారినట్టయింది. అంటే, ఇక విశాఖకు పాలనా రాజధాని, కర్నూలుకు న్యాయ రాజధాని, అమరావతికి శాసన రాజధానిని మార్చాలన్న జగన్ సర్కారు ప్రయత్నానికి మూడు నెలల పాటు బ్రేకులు పడినట్లే. ఇది రాజధాని రైతులు, రాజధాని తరలిపోకూడదనుకునే వారికి తాత్కాలిక ఊరట. అధికార పార్టీలు.. ఒక సభలో మెజారిటీగా ఉండి, మరొక సభలో మైనారిటీగా ఉంటే ఎలాంటి పరిణామాలు, ఫలితాలు ఎదుర్కోవలసి వస్తుందనడానికి ఈ రెండు బిల్లుల ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి.
జ‌గ‌న్ తీరుకు ఈ షాక్‌తో పాటుగా మ‌రిన్ని షాక్‌లు సైతం క‌లుగుతున్నాయి. ఏపీకి 3 రాజధానులపై జాతీయ న్యూస్ ఛానెల్‌ ఇండియా టీవీ సర్వే నిర్వహించి ఏపీ ప్రజల అభిప్రాయాలు సేకరించింది. ఈ సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. మూడింట రెండు వంతుల మంది వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించారు. ఇది త‌ప్పుడు నిర్ణయమని ముఖం మీదే చెప్పేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తాము సమర్దించలేమని మెజార్టీ ప్రజలు కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వ వివరణ కూడా సంతృప్తికరంగా లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆలోచన సరిగా లేదని, ఇది మంచి పద్దతి కాదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.