జగన్ ఎంత ’పవర్ ఫుల్‘ అంటే...

September 24, 2020
CTYPE html>
చంద్రబాబుకు మూడుసార్లు  సీఎం పీఠం దక్కినా దాని పవర్ ను చంద్రబాబు రుచిచూడలేకపోయారు. కానీ... వైఎస్సార్, కేసీఆర్, జగన్... ముఖ్యమంత్రి అయిన మొదటి సారే... ఆ పదవి పవర్ ఎంతో నిరూపిస్తున్నారు. చంద్రబాబుకు సంపద సృష్టి, ఎకానమీ మీద ఉన్న శ్రద్ధ రాజకీయంపై, పవర్ పై లేకపోవడంతో అతనికి ప్రపంచ వ్యాప్తంగా పేరు వచ్చింది గాని పార్టీ మాత్రం బలహీనపడుతూ వచ్చింది.
వైఎస్సార్ మొదటి సారి ముఖ్యమంత్రి అయినపుడు అధికారంతో ప్రతిపక్ష పార్టీలను ఎలా అల్లాడించవచ్చో నిరూపించాడు. అధికారం చేతిలో ఉంటే ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చో నిరూపించాడు. జనం డబ్బులు జనానికి ఇచ్చి వాళ్లను తన అభిమానులుగా ఎలా మార్చుకోవచ్చో నిరూపించాడు. పథకాలు తెలివిగా ప్లాన్ చేస్తే.. ప్రతి ఊరిలో వీరాభిమానులు ఎలా తయారవుతారో నిరూపించారు. ఆరోజు వైఎస్ తీసుకున్న కొన్ని సంచలన నిర్ణయాలు, అతని రాజకీయం వల్ల... ఆనాడు వైఎస్ వేసిన పునాదుల వల్ల ఈరోజు జగన్ ముఖ్యమంత్రి కాగలిగారు. ఇందులో జగన్ ప్రయత్నం, శ్రమ లేదని కాదు... కానీ అప్పటికే ఉన్న బేస్ ని సద్వినియోగం చేసుకుని, కొత్త ఓటర్లను ఆకట్టుకోగలిగాడు జగన్. 
వైఎస్ తర్వాత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్... తెలంగాణలో వైఎస్ ని మరిచిపోయేలా చాకచక్యంగా పథకాలు ప్రవేశ పెట్టాడు. అవే పథకాలు, కొన్ని అంతకంటే ఎక్కువ ప్రయోజనకారి పథకాలు ప్రవేశపెట్టినా ఏపీలో వైఎస్ ను మరిపించలేకపోయారు చంద్రబాబు. అంతేకాదు, ప్రతిపక్షాలను తొక్కేయడంలో, పైకి లేవకుండా చేయడంలో కేసీఆర్ ప్రదర్శించిన చాణక్యానికి ఈనాటికీ తెలంగాణలో ఏ ఇతర పార్టీ కోలుకోలేకపోతోంది. ఇక ఉద్యమంలో ఓ ఊపుఊపిన సంఘాలను ముక్కుపిండి మూలన కూర్చోపెట్టాడు కేసీఆర్. ఇది తెలంగాణయేనా... ఆ విప్లవై చైతన్యం ఏమైంది అని అనుమానం వచ్చేలా కేసీఆర్ అన్ని సంఘాలను ఉక్కుపాదంతో అణచివేశాాడు. కేసీఆర్ సాధించిన మరో విజయం ఏంటంటే...  పార్టీ నేత ఎవరూ నోరు తెరిచి నాకు ఈ పదవి ఇవ్వు అని అడిగే ధైర్యం చేయలేనంత పట్టు పార్టీపై సాధించారు. కేసీఆర్ పదవిస్తే తీసుకోవాలి గాని... ఇవ్వకపోయితే సైలెంటవ్వాలి. ఎదురు ప్రశ్నించే అవకాశమే లేదు. అలా ప్రశ్నించిన వారి పరిస్థితి తెలంగాణలో ఏమవుతుందో అందరికీ తెలుసు. పదవిని అంత పవర్ ఫుల్ గావాడారు కేసీఆర్.
ఇక తాజాగా ముఖ్యమంత్రి అయిన జగన్ తండ్రిని మించిపోయారు. అన్ని వ్యవస్థలను తన కోసం పనిచేసేలా చేయగలిగాడు. మాటిమాటికి ధర్నాలు చేసే సచివాలయ ఉద్యోగులు అమరావతిలో భూములు కొనుక్కుని ప్లాట్లు తీసుకుని స్థిరపడ్డారు. ఒకప్పుడు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నపుడే బెదరించిన ఈ సంఘాలు కన్నీళ్లొచ్చేంత ఏడుపు వచ్చినా కడుపులో దాచుకుని ఇంట్లో ఏడుస్తున్నారు తప్ప నోరు విప్పి బాధ చెప్పలేని పరిస్థితి. అమరావతిని తరలించడం సుతరామూ ఇష్టంలేకపోయినా వారు నోరు విప్పడం లేదు. ఇలాంటి పని చంద్రబాబు చేసి ఉంటే... ఈపాటికి రచ్చచేసేవారు. పోలీసుల్లో అందరికీ కమ్మవారికే ప్రమోషన్లు ఇచ్చారని ప్రతిపక్ష నేతలు కొందరు ఆరోపించినా, అది అబద్ధం అయినా కూడా పోలీసులు గతంలో ఒక్క కేసు పెట్టలేదు. కానీ జగన్ హయాంలో జేసీ లాంటి సీనియర్లు ఒక్క మాట అనగానే పోలీసులు తొడగొట్టి బెదిరించారు. ప్రతిపక్ష నేతపై చెప్పులు వేస్తే ఒక డీజీపీ.... దాని గురించి మాట్లాడుతూ అది ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అన్నారు. కానీ శాంతియుతంగా బస్సు యాత్రకు బయలుదేరిన అమరావతి పరిరక్షణ సమితిని మాత్రం అడ్డుకున్నారు. రాళ్లు వేయడం కంటే... బస్సు యాత్ర ఎక్కువ ప్రమాదకరమా.
ఇక జగన్ మార్క్ బెదిరింపులు ఎలా ఉంటాయో చెప్పడానికి తాజా ఉదాహరణ ఒకటి పరాకాష్ట. చంద్రబాబుకు నిరసన కోసం రెంటుకు ఇచ్చిన ఓ కళ్యాణ్ మండపం యజమానికి నీ పర్మిషను రద్దు చేసే అధికారం మాకుంది. ఇది పెళ్లిళ్లకే మాత్రమే ఇవ్వాలి. నిరసనలకు ఇవ్వకూడదు. మేము మీ అనుమతి రద్దు చేయమని పై అధికారులకు ఫిర్యాదు చేస్తాం.... అంటూ ఎవరూ ధర్నాకు సహకరించని విధంగా భయభ్రాంతులకు గురయ్యేలా పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసు వ్యవస్థను ప్రజల రక్షణ కోసం కాకుండా ప్రతిపక్షాలను అదుపుచేయడానికి, ప్రజల నిరసన హక్కును కాలరాయడానికి ముఖ్యమంత్రి జగన్ సమర్థవంతంగా వాడుతున్నారు.