జగనన్న రాజ్యం: వేధించు.. వెంటాడు..!!

September 21, 2020

రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి తొలగింపునకు జగన్‌ ఎత్తు
పనికిమాలిన కేసులతో కోడెల బలి
రంగా వర్సిటీ వీసీపై ఎస్సీ ఎస్టీ కేసు
తాజాగా ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌పై కన్ను
కార్యాలయంలో ఆయనకు సహాయ నిరాకరణ
అటెండరు నుంచి సిబ్బంది వరకు దూరం

ఆంధ్రప్రదేశ్‌లో వికృత రాజకీయం నడుస్తోంది. ప్రత్యర్థులను బద్ద శత్రువులుగా భావిస్తూ.. దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయి. టీడీపీ కార్యకర్తలు తమ ఇళ్లలో నుంచి కూడా బయటకు రాకుండా అడ్డుగోడలు కట్టేసే అనాగరిక సంస్కృతిని పాలక వైసీపీ విశృంఖలంగా పాటిస్తోంది. ఎస్సీ, ఎస్టీ కేసుల బనాయింపు భారీఎత్తున సాగుతోంది. అయినదానికీ, కానిదానికీ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం రివాజుగా మారింది. లక్ష రూపాయల ఖరీదు చేసే ఫర్నిచర్‌ వ్యవహారంలో మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావుపై పదేళ్ల శిక్షపడే కేసులు నమోదుచేసి.. ఆయన్ను తీవ్రస్థాయిలో వేధించారు. ఈ అవమానం జీర్ణించుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశారు.

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని నయానో భయానో లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చెప్పిన మాటవిననివారు ఎంత పెద్దవారైనా.. ఉన్నత విద్యావంతులైనా సీఎం జగన్‌కు సంబంధం లేదు. రాజీనామా చేయాలంటే చేయాల్సిందే. అలా చేయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి దామోదరనాయుడిపై.. తీసేసిన ఓ కాంట్రాక్టు ఉద్యోగితో ఫిర్యాదు ఇప్పించి మరీ ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెట్టించారు. ఆయన్ను జైలుకు కూడా పంపారు. ఇలా నిత్య వేధింపులతో ఆరుగురు ఉపకులపతులతో రాజీనామాలు చేయించారు. వైసీపీ యువజన విభాగం నేతలు ఇద్దరు రిజిసా్ట్రర్ల నుంచి బలవంతంగా రాజీనామా లేఖలు తీసుకోవడం గమనార్హం.

తాజాగా జగన్‌ కన్ను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌పై పడింది. చంద్రబాబు హయాంలో నియమితులైన ఆయన పదవీకాలం ఇంకా ఉంది. కానీ రాజీనామా చేయాలని ఏకంగా కమిషన్‌ కార్యదర్శితో ఆయనకు చెప్పించారు. ఆయన నిరాకరించడంతో విధి నిర్వహణలో తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. ప్రభుత్వపరంగా అన్ని విధాల  సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఆయన రోజువారీ కార్యకలాపాలను సైతం నిర్వహించలేని అసాధారణ పరిస్థితిలో ఉన్నారు. ఉదయభాస్కర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించాలన్న పట్టుదలతో, ఆ బాధ్యతను ఓ ఉన్నతాధికారికి అప్పగించినట్లు తెలిసింది. అయితే కమిషన్‌ చైర్మన్‌ పదవి రాజ్యాంగ బద్ధమైనది. ఆ హోదాలో ఉన్నవారిని తప్పించడం అంత తేలిక కాదు. గవర్నర్‌ నుంచి రాష్ట్రపతి, సుప్రీంకోర్టు దాకా సాగాల్సిన ప్రక్రియ. దానివల్లే ఉదయభాస్కర్‌కు పొగబెట్టి, తనంతట తానే రాజీనామా చేసి వెళ్లిపోయేలా చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
రోజువారీ పనుల్లో పారదర్శకత కోసం ఆయన తన చాంబర్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. అయితే ఆ కెమెరాలను తాజాగా తొలగించారు.  కెమెరాల డిస్క్‌లను కూడా పట్టుకెళ్లిపోయారు. ఎంత నీచానికి దిగజారారంటే.. ఆయన చాంబర్లో అటెండర్లను కూడా అందుబాటులో ఉంచడం లేదు. పోటీ పరీక్షల షెడ్యూల్‌ మార్చడంతో పాటు పలు అంశాల్లో చైర్మన్‌ ప్రమేయం లేకుండా కార్యదర్శి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల విజయవాడలో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటుచేసి.. చైర్మన్‌ను తొలగించాలని డిమాండ్‌ చేయించారు. ఉదయభాస్కర్‌ ఆఫీసుకు వచ్చినా తలుపులకు తాళాలు తీయడం లేదు. కార్యాలయ సిబ్బందితో సహాయ నిరాకరణ చేయిస్తున్నారు. చాంబర్లో అడుగుపెట్టవద్దని.. రాజీనామా చేసి వెళ్లి పోవాలని ఆయనకు పరోక్షంగా ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. తనకు వేరే పోస్టింగ్‌ ఇవ్వకుండా ఎలా రాజీనామా చేస్తానని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. స్వేచ్ఛగా విధులను నిర్వహించే వాతావరణం లేకపోవడంతో ఆయన ఇటీవల గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. ఆయన అక్కడకు వెళ్లకముందు కార్యదర్శి గవర్నర్‌ను కలిసి ఏపీపీఎస్సీలో జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు తెలిసింది. త్వరలోనే ఉదయభాస్కర్‌పై మూడు కేసులను పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని ఆయన గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

ఆయనపై ఇంత కక్ష పెట్టుకోవడానికి ప్రధాన కారణమే ఉంది. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నియామకాల కోసం ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో రాతపరీక్ష నిర్వహించారు. కానీ పలుచోట్ల పేపర్‌ లీకేజీ జరిగింది. కమిషన్‌ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేసేవారికి ప్రథమ స్థాయి ర్యాంకులు రావడం.. పేపరుకు రూ.2 లక్షల చొప్పున విక్రయించారన్న నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ ప్రతిష్ఠ ఘోరంగా దెబ్బతింది. పరీక్ష నిర్వహణలో, ర్యాంకుల ఖరారులో పెద్దఎత్తున గోల్‌మాల్‌ జరిగినట్లు తేలింది. దీనిపై ఉదయభాస్కర్‌ను అప్పట్లో మీడియా ప్రశ్నించగా.. పరీక్షల నిర్వహణలో కమిషన్‌ ప్రమేయం లేదని.. ప్రశ్నపత్నం రూపకల్పన వరకే తమ బాధ్యతని.. పంచాయతీరాజ్‌, పట్టణాభివృద్ధి శాఖలే పరీక్షలు నిర్వహించాయని ఆయన స్పష్టం చేశారు. ఆ రెండు శాఖల్లోనే కుంభకోణం అంతా నడిచిందని వెల్లడయ్యేటప్పటికి ఉదయభాస్కర్‌పై సీఎం జగన్‌ కినుక వ్యవహరించారు. ఆయన్ను పదవి నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నారు. ఆయన తనంత తాను వైదొలిగేలా చేసేందుకు క్రిమినల్‌ కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.