రోజా ఎపిసోడ్ : జగన్ ఎమ్మెల్యేలు గప్ చుప్

September 24, 2020

ప్రభుత్వ విధానాల్ని సరిగా అర్థం చేసుకోవటంలో ఏ మాత్రం తప్పు జరిగినా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అవుతున్నారా? ఎవరిని ఉపేక్షించటం లేదా? తప్పు చేసిన వారి విషయంలో ఒకింత కఠినంగానే ఉంటున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఆర్కే రోజాకు ఎదురైన తాజా అనుభవం జగన్ పార్టీ ఎమ్మెల్యేల్ని గప్ చూప్ గా మారేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.
ఇంతకూ ఏం జరిగిందంటే.. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గడిచిన 24 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేయటానికి కారణం.. ఏపీ ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవటం. ఏపీ ప్రభుత్వం తీసుకున్నట్లే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఎందుకు తీసుకోలేదన్నతలంపుతో మొదలైన సమ్మె.. అంతకంతకూ తీవ్రం కావటమే కాదు.. మరో నాలుగు రోజుల్లో నాలుగోవారానికి చేరే పరిస్థితి.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సీఎం ప్రెస్ మీట్ పెట్టి.. ఏపీ ప్రభుత్వం మీద చురకలు వేశారు. ఏపీ ఆర్టీసీని విలీనం చేయలేదని.. కేవలం కమిటీ మాత్రమే వేసినట్లుగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే.. ఇది తప్పన్న విషయాన్ని ఏపీ రవాణా శాఖామంత్రి మాత్రమే స్పందించారు. మరెవరూ రియాక్ట్ కాలేదు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగిన వేళ.. ఆర్కే రోజా రియాక్ట్ అవుతూ.. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే.. వారితో చర్చలు జరపకుండా నిర్దాక్షణ్యంగా ఉద్యోగాల్ని తీసివేశారంటూ తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తప్ప పట్టారు.
అయితే.. ఈ వ్యాఖ్యలు ప్రజల వరకూ పెద్దగా చేరకున్నా.. సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు మాత్రం చేరినట్లు తెలుస్తోంది. దీంతో.. ఆగ్రహానికి గురైన జగన్.. ఫైర్ బ్రాండ్ కు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్ని తెలంగాణ ప్రభుత్వం మీద ఉసిగొల్పేలా వ్యాఖ్యలు చేయటం ఏమిటంటూ క్లాస్ పీకటమే కాదు.. అనవసర విషయాల్లో తలదూర్చొద్దని.. కల్పించుకోవద్దని తీవ్ర స్వరంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎవరూ నోరు తెరవటం లేదు.