మీరు మారకపోతే సంకనాకిపోతాం - స్టేజిపైనే బాబుకి చెప్పేసిన జేసీ

September 22, 2020

జేసీ దివాకర్ రెడ్డి... తెలుగు రాజకీయాల్లో భిన్నమైన వ్యక్తి. ప్రజల గురించి అయినా, నాయకుల గురించి అయినా... ఏదైనా మాట్లాడగలడు. లోపలొక మాట, బయటొక మాట అనే సమస్యే లేదు. ఏదయినా నేరుగానే అనేస్తాడు. మంచి ఉంటే పొగుడుతాడు. చెడు ఉంటే విమర్శిస్తాడు. తిడతాడు. కానీ తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు. ఇంతవరకు చంద్రబాబుకు ఎవరూ ఇవ్వనంత ఫీడ్ బ్యాక్ ని నేరుగా మీడియా ద్వారానే ఇచ్చిన వ్యక్తి. అయితే... రాజకీయాల్లో పొరపాట్లు ఖరీదైనవి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆ ఖరీదైన పొరపాటు చేసి అధికారం పోగొట్టుకున్నారు. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి బహిరంగ వేదిక మీద అనంతపురంలో చంద్రబాబుకు తన పొరపాటును గుర్తుచేసి మారమని బహిరంగంగా బతిమాలాడు. 

కార్యకర్తల మీటింగు కోసం అనంతపురం వెళ్లిన చంద్రబాబుకు వేదిక మీద జేసీ ద్వారా విచిత్రమైన అనుభవం ఎదురైంది. తెలుగుదేశం కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులకు వేదిక మీద నుంచి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చిన జేసీ... ఐదేళ్ల తర్వాత మీ కథ చూస్తానురా అని హెచ్చరించారు. అనంతరం వేదిక మీద ఉన్న చంద్రబాబును... బాబు గారు ఇప్పటికయినా మీరు మారండి. శాంతి ప్రవచనాలు వదిలేయండి. నేను ఎన్నికల ముందే చెప్పాను. ఎమ్మెల్యేలను మార్చమని. అనేక కారణాలతో మీరు మార్చలేకపోయారు. ఈ విషయంలో వైఎస్ వేల రెట్లు మాలు. జరిగింది వదిలేయండి. భవిష్యత్తులో మాత్రం మీరు ఈ శాంతిమార్గంలో పోతే కష్టం అంటూ గట్టిగా డిమాండ్ చేశారు.

అనంతరం చంద్రబాబు గతంలో ఏం తప్పు చేశారో చెబుతూ... మీరు ఎంతసేపు అధికారులతో మాట్లాడడానికి ఇష్టపడ్డారే గాని... నేను ఏదైనా చెప్పడానికి వచ్చినపుడు పట్టించుకోలేదు. వాడి పాలన బాగలేదని చెప్పేవారంతా ఈ స్టేజి మీద కూర్చున్నారు. పార్టీ వాళ్లే అబద్దాలు మిమ్మల్ని మోసం చేశారు, మీరు మోసపోయారు. కాయకష్టం చేసేవాడికి, ఓటేసేవాడికి వాడు (జగన్ ) నచ్చుతున్నాడు. వాడి (జగన్)కి ఈ మధ్య ఓ మంచి పేరు వచ్చింది. కరెక్టు టయానికి వస్తాడు. అరగంట మాట్లాడతాడు. చెప్పాల్సింది చెబుతాడు. బైబై మని వెళ్లిపోతాడు అంటూ జగన్ గురించి వివరించారు. అదే మీరు గంటల గంటలు అధికారులతో మాట్లాడతారు గాని... ఏదయినా చెప్పడానికి వస్తే... ’’ఏయ్ దివాకర్ ఏంటి పరిస్థితి అని ఓ అరగంట టైమిచ్చారా? లేదు. మీరు ముఖ్యమంత్రి కావాలని నేను బలంగా కోరుకునేవాడిని. నా మాట వినండి.’’ మీటింగులు కాదు... జనానికి నచ్చేది చేయాలి. జనాలకు కావల్సింది కాదంటూ ...వేదిక మీద జేసీ దివాకర్ రెడ్డి హోరెత్తించారు.  

జేసీ చెప్పినదాంతో తెలుగుదేశం కార్యకర్తలు ఏకీభవించారు. అవును సార్.. మీరు తప్పు చేస్తే మనోళ్లయినా శిక్షిస్తారు. వాళ్లేమో మర్డర్లు చేసినా సొంత వాళ్లను కాపాడుకుంటారు అంటూ జనం జేసీ మాటలకు మద్దతు తెలిపారు. చంద్రబాబు కూడా రెండు చేతులతో కృతజ్జతలు చెప్పి జేసీ మాటలను స్వీకరించారు.