జార్ఖండ్ .. బీజేపీ ఫసక్ 

September 24, 2020

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మోడీ ప్రభ కమిలిపోయింది. కాంగ్రెస్, జేఎంఎం కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అధికార బీజేపీ 27 స్థానాలకు పరిమితం అయ్యింది. కాంగ్రెస్ కూటమికి 42 స్థానాల్లో ఆధిక్యం ఉంది. ఇతరులు 12 స్థానాల్లో దూసుకుపోతున్నారు. ఇంకా ఫిగర్లు ఫైనల్ కాలేదు గానీ ఈ ఫలితాలే దాదాపు ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ రోజు (సోమవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని తొలుత అనుకున్నా పౌరసత్వ సవరణ చట్టం.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో పరిస్థితులు అనూహ్యంగా మారాయి. పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయని పేర్కొన్నాయి. అలాగే జరిగింది.

రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అధికారం చేపట్టాలంటే 41 స్థానాల్ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 30 నుంచి డిసెంబరు 20 వరకు ఐదు విడతల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఈ ఉదయం నుంచి సాగుతోంది. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ కూటమికి సంపూర్ణ మెజారిటీ దక్కేలా ఉంది. ఇది కాంగ్రెస్ కు మంచి బలాన్నిచ్చేలా ఉంది.