జ్యోతిక... కోరిక విన్నారా?

September 21, 2020

పెళ్లి అయ్యాక హీరోయిన్ కెరీర్ కు పుల్ స్టాప్ పడినట్లే అనుకున్నాం గానీ జ్యోతిక మళ్లీ ఓ రేంజ్ లో మొదలుపెట్టింది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్లకు అవకాశాలు రావటమే కాదు.. కొందరైతే ఏకంగా గ్లామర్ రోల్స్ చేయటానికి సైతం వెనుకాడటం లేదు. నిజానికి హీరోకు లేని పరిమితులు హీరోయిన్లకు ఏమిటన్న మాటలోనూ న్యాయం ఉందిగా. పెళ్లి తర్వాత ఇంటి కోసం కెరీర్ ను త్యాగం చేసి.. సెలెక్టివ్ పాత్రల్ని చేస్తున్న జ్యోతిక తాజాగా నటించిన చిత్రం జాక్ పాట్. ఈ శుక్రవారం తమిళంలో విడుదలవుతున్న ఈ చిత్రం.. తర్వాత తెలుగులోనూ విడుదల కానుంది. జ్యోతిక.. రేవతి నటించిన ఈ చిత్రం మీద పెద్ద ఎత్తున అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. చిత్ర ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన జ్యోతిక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మీ డ్రీం రోల్ అన్నంతనే ఆమె తన మనసులోని మాట చెప్పేసి షాకిచ్చారు. హీరోలాంటి పాత్రను చేయటమే తన డ్రీం రోల్ గా చెప్పారు. తాను చెప్పిన మాటకు ఆశ్చర్యపోవాల్సిన పని లేదని.. హీరోలాంటి కథలో నటించాలని తనకు ఉందన్నారు.
తాను నటించటమే కాదు.. నిర్మాతకు మంచి కలెక్షన్లు రావాలన్నారు. సౌత్ లో హీరోయిన్ ప్రత్యేకతను.. స్టార్ డమ్ ను చాటేలా సినిమా రావాలని.. అందులో పంచ్ డైలాగులు ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. తాను తాజాగా నటించిన జాక్ పాట్ లో కొంత ట్రై చేసినట్లు చెప్పారు.