రూ.100 కోట్ల లాండ్ స్కామ్ లో .. జగన్ పార్టీ ఎమ్మెల్యే

September 24, 2020

సీనియర్ నేతగా సుపరిచితుడు.. కర్నూలు జిల్లాలో పేరున్న నేతగా.. పలుమార్లు ఎన్నికల్లో విజయం సాధించి.. ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి పేరు ఒక భూవివాదంలో ప్రముఖంగా వినిపించటం హాట్ టాపిక్ గా మారింది. తమకు చెందిన భూమి మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బోర్డు పెట్టేశారని.. దాని విలువ ఏకంగా రూ.100 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ సమీపంలోని తుఫ్రాన్ పేట శివారులో ఒక సర్వే నంబరులో సుమారు 40 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎకరం రూ.2 నుంచి రూ.2.5 కోట్ల వరకూ పలుకుతోంది. తుఫ్రాన్ పేట గ్రామం పగడాల వంశస్థులకు చెందిన ఈ భూమిని 2000లో కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్ రెడ్డి తన పేరు మీద జీపీఏ చేసుకున్నారు. తర్వాత ఈ ప్లాట్లను అమ్మటంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కొనుగోలు చేశారు. ఈ వెంచర్ లో దాదాపు 828 ఫ్లాట్లు వేశారు.
ఇదిలా ఉంటే తాజాగా కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి 40 ఎకరాలు తమవేనంటూ ఒక బోర్డు ఏర్పాటు చేయటం సంచలనంగా మారింది. అంతేకాదు.. ఈ ఏడాది ఏప్రిల్ లో వెంచర్ లో ఉన్న ఫ్లాట్ల హద్దురాళ్లను తొలగించి.. అందులోకి ఎవరూ వెళ్లకుండా పెద్ద పెద్ద గుంతలు తవ్వేశారు. దీంతో.. ఇక్కడ ఫ్లాట్లను కొన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇక్కడ ఫ్లాట్లు కొన్న బాధితులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటమే కాదు.. ఇక్కడ ఏర్పాటు చేసిన బోర్డులోని నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడారు.
ఇదే అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 2008లో తన భార్య మీద 40 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించానని.. నెల రోజులుగా తమకు కొందరు ఫోన్లు చేసి.. ఆ వెంచర్ లో తమకు ఫ్లాట్లు ఉన్నట్లుగా చెప్పారన్న కాటసాని.. ఎవరైనా తమకంటే ముందే ఆ భూమికి కొన్నట్లుగా పత్రాలు తీసుకొస్తే వారికి వదిలేస్తామని వ్యాఖ్యానించటం గమనార్హం. తాము భూమి కొన్నట్లు పక్కా ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నారు. మరీ.. విషయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికకరంగా మారింది.