ఒకే పంథాలో టీఆర్ఎస్, వైసీపీ !!

September 24, 2020

అటు తెలంగాణ‌, ఇటు ఏపీ ఈ రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలూ మీడియాపై క‌త్తిక‌ట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వానికి, పాలకులకు వ్య‌తిరేకంగా వ‌స్తున్న వార్త‌ల విష‌యంలో క‌న్నెర్ర చేస్తున్న ఈ రెండు ప్ర‌భుత్వాలు త‌మ‌కు గిట్ట‌ని మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ముఖ్యంగా ప్ర‌భుత్వ అనుకూల వార్త‌లు రాయాల‌నేది ఈ రెండు ప్ర‌భుత్వాల త‌ప‌న‌గా క‌నిపిస్తోంది. వాస్త‌వానికి జ‌ర్న‌లిజం అంటేనే ప్ర‌జ‌లకు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌ధి. నిత్యం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకు రావ‌డంతోపాటు ఆయా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక దృష్టిని సారించ‌డం, ప్ర‌భుత్వ విధానాల్లోని లోపాల‌ను ఎండ‌గ‌ట్ట‌డం అనేది మీడియా చేసే ప్ర‌ధాన విధి.

అస‌లు జ‌ర్న‌లిజం అంటేనే ప్ర‌భుత్వ లోపాల‌ను ఎండ‌గ‌ట్ట‌డం. కానీ, నేడు మారిన పాల‌కుల ధోర‌ణులు మీడియాపై యుద్ధానికి దిగేలా చేస్తున్నాయి. ఉంటే మాకు అనుకూలంగా ఉండాలి. లేకుంటే మూతైనా ప‌డాలి! అనే ధోర‌ణిలో ఉన్నారు పాల‌కులు. అటు తెలంగాణ విష‌యాన్ని ప‌రిశీలించినా.. ఇటు ఏపీ విష‌యాన్ని ప‌రిశీలించినా కూడా ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం తెలంగాణలో ఆర్టీసీ స‌మ్మె కొన‌సాగుతోంది. కార్మికులు ఆత్మ‌హ‌త్య‌కు ఒడిగ‌డుతున్నారు. అదే స‌మ‌యంలో ఏపీలో ఇసుక కొర‌త కార్మికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ కూడా కార్మికులు రోజు గ‌డ‌వ‌క ఇబ్బంది ప‌డుతున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ ప్ర‌జ‌ల్లో పాల‌కుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.
అయితే, ఈ వార్త‌ల‌ను య‌ధాత‌థంగా ప్ర‌చురించి, కార్మికుల స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తెచ్చేందుకు మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అయితే, ఇలా చేయ‌డాన్ని కూడా పాల‌కులు స‌హించ‌లేక పోతున్నారు. త‌మపై క‌త్తి క‌ట్టార‌ని, ప్ర‌భుత్వాన్ని డైల్యూట్ చేసేందుకు ఇలా చేస్తున్నార‌ని అంటూ ప్ర‌భుత్వ పెద్ద‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో త‌మ‌కు అనుకూల మీడియాల్లో ప్ర‌తిప‌క్షాల‌పైనా,. గ‌త ప్ర‌భుత్వాల‌పైనా లేనిపోని రాత‌లు రాయిస్తున్నార‌న్న టాక్ కూడా ఉంది. ఇలా త‌మ‌కు అనుకూల వార్త‌లు రాయాల‌ని, త‌మకు డ‌ప్పుకొట్టాల‌నే ధోర‌ణిని పెంచుకుంటున్న ప‌రిస్థితి నానాటికీ పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.
ఇక‌, ఏపీలో అయితే, ఏకంగా మీడియాకు సంకెళ్లు వేసేలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం జీవో 2430ను తీసుకురావ‌డం మ‌రింత వివాదాస్ప‌ద మైంది. త‌మ‌పై నిరాధార వార్త‌లు రాసినా, క‌థ‌నాలు ప్ర‌సారం చేసినా.. స‌ద‌రు సంస్థ‌ల‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు, ప‌రువు న‌ష్టం చ‌ర్యలు తీసుకునే అధికారాన్ని కార్య‌ద‌ర్శుల‌కు క‌ట్ట‌బెడుతూ.. ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 2430 తీవ్ర వివాదం రేపింది. అయినా కూడా ప్ర‌భుత్వం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఇలా అటు తెలంగాణ‌, ఇటు ఏపీలోనూ ప్ర‌భుత్వాలు మీడియాను త‌మ చెప్పు చేత‌ల్లో ఉంచుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు సాగిస్తుండ‌డం ప్ర‌జాస్వామ్యానికే గొడ్డ‌లి పెట్టుగా ప‌రిణ‌మించింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.