కేసీఆర్ నిర్ణయం తప్పు.. తేల్చేసిన కేటీఆర్

September 21, 2020

నిజమే.. హెడ్డింగ్ లో చెప్పినంత సూటిగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించలేదన్నది నిజం కాకుంటే.. ఆయన మాటల్ని మొత్తంగా మదిస్తే.. వచ్చేది ఇదేనన్నది మర్చిపోకూడదు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని తీసుకుంటే.. దేశంలోని మరే రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని సమర్థించటమా? వ్యతిరేకించటమా? అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతున్న వేళ.. అందరిని ఆశ్చర్యపరుస్తూ.. ఢిల్లీకి వెళ్లి మరీ ప్రధాని మోడీతో కలిసి గంటల కొద్దీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటమే కాదు.. పెద్ద నోట్ల రద్దు అంశానికి తన పూర్తి మద్దతు తెలపటమే కాదు.. ప్రధాని నిర్ణయం అద్భుతమన్నట్లుగా ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రికి లేని క్లారిటీ పెద్ద నోట్ల రద్దు మీద తనకు ఉందన్నట్లుగా కేసీఆర్ అప్పట్లో బిల్డప్ ఇవ్వటాన్ని మర్చిపోకూడదు. కట్ చేస్తే.. తాజాగా ఒక మీడియా సంస్థ ఢిల్లీలో నిర్వహించిన సదస్సులోమాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దు మీద తాము తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా తేల్చేశారు. పెద్దనోట్ల రద్దు ద్వారా దేశానికి మంచి జరుగుతుందని ఆశించామని.. కానీ అది తప్పని తేల్చారు.
పెద్దనోట్ల రద్దుతో సంపూర్ణ క్రాంతి వస్తుందనే ప్రధాని మాటల్ని  తాము నమ్మామని.. అందుకే కేంద్ర నిర్ణయానికి తమ మద్దతు ప్రకటించామని.. కానీ పెద్దనోట్ల రద్దు ద్వారా దేశానికి నష్టం జరిగిందని తేలిన తర్వాత తాము తీసుకున్న నిర్ణయం తప్పని తేలిందని తేల్చేశారు. మొత్తానికి తన తండ్రి తీసుకున్న నిర్ణయం తప్పన్న విషయాన్ని కేటీఆర్ తేల్చేశారని చెప్పాలి.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కేంద్రంలో చక్రం తిప్పాలని తపిస్తున్న కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లే తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. రేపొద్దున జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక.. పెద్ద నోట్ల రద్దు సందర్భంలో మోడీని అంతలా వెనకేసుకొచ్చావ్ కదా? అన్న ప్రశ్నను ఎవరైనా సంధించే వీలుంది. ఎవరో ఏదో అడిగే దాని కంటే ముందే.. తప్పు ఒప్పేసుకోవటం.. అది కూడా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంగా చెప్పటం ద్వారా కేసీఆర్ కు జరిగే డ్యామేజ్ ను తగ్గించే వీలుంది.
ఒకవేళ తర్వాతి రోజుల్లో ఎవరైనా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఇబ్బంది పెట్టే పనిలో భాగంగా అడిగినా.. బలమైన కౌంటర్ ఇచ్చేందుకు వీలుగా కేటీఆర్ తాజా వ్యాఖ్యలు గ్రౌండ్ ను సెట్ చేసినట్లే. పెద్దనోట్ల రద్దు సందర్భంలో తామిచ్చిన మద్దుతు అంశంపై ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశామని చెప్పేయొచ్చు. తద్వారా  పెద్దనోట్ల రద్దు వేళ మోడీ సర్కారుకు ఇచ్చిన మద్దుతు తప్పు.. తమ ఖాతాలో పడకుండా ఉండేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉండనున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే తాజాగా కేటీఆర్ తన తండ్రి తప్పును తెలంగాణ రాష్ట్ర  సర్కారు తప్పుగా చెప్పేశారని చెప్పక తప్పదు.