మాట్లాడేముందు కేసీఆర్ ఆలోచించడా?

September 24, 2020

ఒకే ఒక ఎన్నిక. దాని ఫలితం వచ్చింది. ఉప ఎన్నికల్లో అధికార పార్టీలు గెలవడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ ఒక రాష్ట్ర అసెంబ్లీలో గెలిచినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు విజయగర్వంతో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ప్రధాన అంశంగా మాట్లాడుతూ.. ఇతర అనేక అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన ఒక వ్యాఖ్యను మనం కచ్చితంగా చర్చించాలి. కేసీఆర్ మాట్లాడిన ఆ మాట ఏంటంటే... 

’’సీఎంని తిట్టడం యూనియన్ నాయకులకు సంస్కారమా?’’ అన్నారు.

ఎస్ ఇదే ప్రశ్న... కేసీఆర్ కు రివర్సులో వెయ్యాలి. ముఖ్యమంత్రిని తిట్టే సంస్కారాన్ని తెలుగు రాష్ట్రాలకు నేర్పించిన వ్యక్తి, ఆద్యుడు కేసీఆరే. ఉద్యమ నేపథ్యంలో ఎవరూ తనను టచ్ చేయలేరు అనే ధైర్యంతో ముఖ్యమంత్రులను తిట్టడం కేసీఆర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత అందరూ ఫాలో అవుతున్నారు. మరి ఈ సంస్కారం కేసీఆర్ కు అప్పట్లో ఉండేది కాదా? ఆ సంస్కారం లేకపోవడం వల్లే అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రులను తిట్టేవాడు అనుకోవాలా? సరే ఇదంతా పక్కన పెడదాం.

కొన్ని నెలల క్రితం ఆంధ్రా ఎన్నికలకు ముందు కేసీఆర్ ఏ సంస్కారంతో ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబును తీవ్రంగా విమర్శించాడు? 

రెండు సంవత్సరాల పాటు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబును అనరాని మాటలు అని సంస్కార రహితంగా మాట్లాడిన జగన్ తో వైసీపీ నేతలతో ఏ సంస్కారంతో కేసీఆర్ స్నేహం చేశాడు. 

రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి... ఉన్నపుడు ఏ సంస్కారంతో కేసీఆర్ కుటుంబ సభ్యులంతా ముఖ్యమంత్రులను తిట్టారు. అప్పట్లో సంస్కార హీనం వల్ల తిట్టారా? 

తన కాళ్ల మీద పడి ఆశీర్వాదాలు తీసుకున్న విజయసాయిరెడ్డి... ముఖ్యమంత్రిని బండబూతులు తిట్టినపుడు ఇది సంస్కారం కాదు అని మిత్ర బృందానికి కేసీఆర్ కి చెప్పాలనిపించలేదా?

ఇపుడు సీఎంని తిట్టడం సంస్కారమా? అని ప్రశ్నించే హక్కు కేసీఆర్ కు ఉందా. ఆయన నేర్పిన విద్య ఇపుడు రాష్ట్రంలో నేతలంతా నేర్చుకున్నారు. ముఖ్యమంత్రులను తిడుతున్నారు.