హ‌రీశ్‌రావు..ఇప్పుడు గుర్తుకు వ‌చ్చాడా కేసీఆర్ ?

September 25, 2020

త‌న్నీరు హరీశ్‌ రావు...తెలంగాణ రాష్ట్ర స‌మితిలో పార్టీ అటెండ‌ర్ నుంచి పార్టీ అధినేత కేసీఆర్ వ‌ర‌కు త‌న అనుకునే న‌మ్మ‌కం క‌లిగి ఉన్న‌ నేత‌. 18 ఏళ్ల టీఆర్ఎస్ ప్ర‌స్థానంలో ఉత్తాన‌, ప‌త‌నాలన్నింటికీ హ‌రీశ్ రావు ప్ర‌త్య‌క్ష సాక్షి, భాగ‌స్వామి కూడా! పార్టీకి ఇబ్బందిక‌ర‌మైన ప‌రిణామాలు ఎదురైన‌పుడు వాటిని చాక‌చ‌క్యంతో ప‌రిష్క‌రించిన నేత‌. ట్రబుల్ షూట‌ర్‌గా పేరు సంపాదించిన నాయ‌కుడు. అయితే కొద్దికాలంగా...టీఆర్ఎస్‌లో చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో హ‌రీశ్‌రావు పాత్ర నామ‌మాత్ర‌మైన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న స్థానం ఏంట‌నేది పార్టీ నేత‌ల‌కే అంతుబ‌ట్ట‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ....హ‌రీశ్ త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. తాజాగా...ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే..కేసీఆర్‌కు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌కుండా మారిపోయిన‌ ఆర్టీసీ స‌మ్మె.
ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్య కుద‌రాల‌ని...స‌మ్మె విర‌మ‌ణ కావాల‌ని ప్ర‌భుత్వం ఆకాంక్షించిన‌ప్ప‌టికీ...ఇరు వ‌ర్గాల మొండి వైఖ‌రితో స‌మ్మె కొన‌సాగుతోంది. మ‌రోవైపు...వివిధ పిటిష‌న్లు, ప్ర‌జాప్ర‌యోజ‌న వాజ్యాల రూపంలో..స‌ర్కారుపై మొట్టికాయ‌లు ప‌డుతున్నాయి. డ్యూటీలో చేరాలంటూ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్లైన్పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం తీరు పిలుపులా లేదని, బెదిరింపులా ఉందని వ్యాఖ్యానించింది.  ``స‌మ్మెను కొలిక్కి తేవాల‌ని మేం ప్రయత్నిస్తున్నా.. ప్రభుత్వం, కార్మిక సంఘాల వైఖరి వల్ల సమస్య కొలిక్కిరావడం లేదు. ఆర్టీసీ ఇష్యూ లో ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావటం లేదు. మరోసారి సర్కార్‌‌ సానుకూల వైఖరితో వస్తుందని ఆశిస్తున్నాం`` అని ధ‌ర్మాస‌నం పేర్కొంది.
ఇలా..కోర్టులో ఊహించ‌ని షాకులు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో...ముఖ్య‌మంత్రి కేసీఆర్‌..ప్ర‌త్యామ్నాయ‌లు వెతుకుతున్న‌ట్లు స‌మాచారం. చర్చలకు పిలిస్తే వస్తామంటూ కార్మిక సంఘాల ప్రతిపాదనపై సీఎం స్పందిస్తూ ‘‘చ‌ర్చ‌ల‌కు అలా ఎలా పిలుస్తాం. డెడ్ లైన్ కంటే ముందు అందరూ డ్యూటీలో చేరి ఉంటే ఆలోచించేవాళ్లం. చివరి చాన్స్ ఇచ్చినా కార్మికులు మొండికేస్తే మళ్లీ మనమే చర్చలకు పిలవాలా.. మనమే దిగిరావాలా’’ అని వ్యాఖ్యానించిన కేసీఆర్‌...హైకోర్టు కేంద్రంగా ప‌రిణామాలు మారుతుండ‌టంతో...మెట్టుదిగిన‌ట్లు స‌మాచారం. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు, ర‌వాణామంత్రి పువ్వాడ అజ‌య్‌, న్యాయ‌శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌రణ్‌ రెడ్డి, ఉద్యోగ సంఘాల నేత అయిన మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌ల‌తో ఉప‌క‌మిటీ వేయ‌నున్న‌ట్లు  తెలుస్తోంది. మొత్తంగా...మ‌రోమారు త‌న ప్ర‌భుత్వ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే స‌త్తా ఉన్న వ్య‌క్తి హ‌రీశే అని కేసీఆర్ గుర్తించార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.