మంత్రులకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ : వ్యూహమిదేనా?

September 21, 2020

ఊహించని రీతిలో వ్యవహరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుతో మంత్రులు బెంబేలెత్తి పోయిన పరిస్థితి. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో ముఖ్యమంత్రిలోని ఉగ్రరూపాన్ని చూసిన వారికి దిక్కు తోచని పరిస్థితి చోటు చేసుకుందని చెబుతున్నారు. గతానికి భిన్నంగా మంత్రులకు కేసీఆర్ హెచ్చరికలు చేయటానికి కారణం.. మున్సిపోల్స్ గా చెప్పక తప్పదు.
ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊహించని రీతిలో భారీ మెజార్టీని సొంతం చేసుకొని.. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందటం తెలిసిందే. ఇది జరిగిన నాలుగైదు నెలలకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో గులాబీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం.. మితిమీరిన ఆత్మవిశ్వాసం మొదటికే మోసం వచ్చేలా చేసింది. పదహారు ఎంపీ సీట్లు తమవే అన్నట్లు బీరాలు పలికినా.. చివరకూ ఉన్న పరువు పోయేలా దారుణమైన ఫలితాలు ఎదురుకావటం తెలిసిందే.
ఇలాంటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదురైతే తిప్పలు తప్పవన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ముందస్తు జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు. మంత్రులకు తీవ్ర హెచ్చరికలు చేయటం వెనుక ఇదే కారణమంటున్నారు. మంత్రుల పరిధిలో ఏ మున్సిపాలిటీలో అయినా పార్టీ ఓడిపోతే.. అందుకు బాధ్యత ఆయనే వహించాల్సి వస్తుందని చెప్పటమే కాదు.. వారి మంత్రి పదవులు కూడా ఊడతాయన్న వార్నింగ్ ఇచ్చి షాకిచ్చారు.
ఓవైపు వార్నింగ్ ఇస్తూనే.. మరోవైపు పార్టీకి ఎలాంటి ఢోకా లేదని సర్ది చెప్పటం గమనార్హం. తనకున్నఅంచనాల ప్రకారం టీఆర్ఎస్ కు 120 మున్సిపాలిటీల్లోనూ.. 10 కార్పొరేషన్లోనూ గులాబీ జెండా ఎగరటం ఖాయమన్న భరోసాను ఇచ్చారు. తాము చేయించిన సర్వేలన్ని టీఆర్ఎస్  కే అనుకూలంగా ఉన్నాయన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇస్తుందన్న అపోహల్ని విడిచిపెట్టాలన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విస్త్రత స్థాయి సమావేశంలో సుమారు 300 మంది ముఖ్యనేతలు పాల్గొన్నారు. వారందరికి మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల్ని.. ప్రచార కార్యక్రమాలపైనా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ వ్యూహం చూస్తే.. పార్టీ నేతల్లో అనవసరమైన ధీమాను పొగొడుతూ అలెర్ట్ చేయటంతో పాటు.. తప్పులు జరిగితే అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుందన్న విషయాన్ని చెప్పేశారని చెప్పాలి. గెలుస్తామన్న విశ్వాసం మితిమీరితే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తించిన ఆయన.. పార్టీ శ్రేణుల్ని తన మాటలతో అలెర్ట్ చేశారని చెప్పక తప్పదు.