అబద్ధానికి బూతు యాడైంది... వైసీపీ దెబ్బైపోయింది

September 21, 2020

నిజమే... సన్న బియ్యం విషయంలో జగన్ సర్కారు ఆడిన అబద్దానికి మంత్రి కొడాలి నాని నోట నుంచి వచ్చిన బూతు పదం కలిసిపోయి... వైసీపీని అడ్డంగా బుక్ చేసేసింది. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రూపొందించేసిన నెటిజన్లు... వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ మోహన్ రెడ్డిని, మరీ ముఖ్యంగా మంత్రి కొడాలి నాని ఓ ఆటాడేసుకుంటున్నారు. వెరసి అబద్దానికి తోడైన బూతు పదం... వైసీపీ సర్కారును నిజంగానే పెద్ద దెబ్బ కొట్టేసిందన్న వాదన వినిపిస్తోంది. ఈ ఎపిసోడ్ కు తాజా పూరి జగన్నాథ్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ లోని పాపులర్ సాంగ్ ను జత చేసిన నెటిజన్లు వదిలిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. 

ఎన్నికలకు ముందు పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో జగన్ నోట సన్నబియ్యం అనే మాట పదే పదే వినిపించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్... తన కేబినెట్ లోకి కొడాలి నానిని తీసుకుని పౌర సరఫరాల శాఖ బాధ్యతలను అప్పగించారు. ఇంకేముంది పౌర సరఫరాల శాఖ మంత్రి హోదాలో సన్నబియ్యం పంపిణీపై నాని ఓ సమీక్ష ఏర్పాటు చేశారు. త్వరలోనే సన్నబియ్యం పంపిణీ చేస్తామంటూ ఊదరగొట్టేశారు. నాని సమీక్ష తర్వాత జరిగిన ఓ బహిరంగ సభలో జగన్ కూడా త్వరలోనే సన్నబియ్యం పంపిణీ చేస్తామంటూ ఘనంగానే ప్రకటించి జనం చేత చప్పట్లు కూడా కొట్టించుకున్నారు. 

ఇంతలో ఏమైందో? ఏమో తెలియదు గానీ... సన్నబియ్యం అన్న మాట కాస్తా నాణ్యమైన బియ్యంగా మారిపోయింది. అసలు తాము సన్నబియ్యం అని ఎప్పుడూ చెప్పలేదే అంటూ నానితో పాటు జగన్ కేబినెట్ లోని మంత్రులంతా కోడై కూశారు. ఈ వాదన జరుగుతుండగానే... మొన్న గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ జంప్ కొట్టేసి అప్పటిదాకా తాను కలిసి తిరిగిన టీడీపీ నేతలపై నానా దుర్భాషలు మొదలెట్టేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు కూడా రంగంలోకి దిగిపోయి... వంశీని ఓ ఆటాడేసుకున్నారు. సందట్లో సడేమియాలాగా నాని కూడా ఎంట్రీ ఇచ్చి టీడీపీ నేతలను ఓ రేంజిలో తగులుకున్నారు. నాని వచ్చాక... దేవినేని ఉమామహేశ్వరరావు సన్నబియ్యం అంశాన్ని ప్రస్తావించారు. సన్నబియ్యం ఇస్తామన్న వారు ఎక్కడ? అంటూ ఉమా తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. 

అసలే మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడతారో తెలియని స్థితిలో కొనసాగుతున్న నాని... తనను ప్రశ్నించిన ఉమాకు కౌంటర్ ఇచ్చేందుకు ఎంట్రీ ఇచ్చి... అసలు సన్నబియ్యం ఇస్తామని మేమెవరికీ చెప్పలేదంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఆ సందర్భంగా సన్నబియ్యం ఇస్తామని ఎవరికి చెప్పానంటూ దేవినేని ఉమాను ఉద్దేశిస్తూ... ‘నీ అమ్మ మొగుడికి చెప్పానా?’ అంట ఓ బూతు పదాన్ని వాడారు. అంతే... సాక్షి పత్రిక, టీవీ కటింగ్ లను సేకరించిన నెటిజన్లు... సన్నబియ్యం అంటూ నానితో పాటు జగన్ కూడా పలికిన పలుకులను, సాక్షి రాసిన రాతలను కలిపేసి... ఇస్మార్ట్ శంకర్ సాంగ్ ను యాడ్ చేసి ఓ వీడియోను నెటిజన్లు వదిలేశారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతూ... నానితో పాటు జగన్ ... మొత్తంగా వైసీపీ సర్కారునే ఓ రేంజిలో ఏకిపారేస్తోంది.