కేటీఆర్.. కాబోయే సీఎం అని టీటీడీ అధికారులు డిసైడ్ అయ్యారా?

September 22, 2020

ముక్కోటి ఏకాదశి రోజున రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు.. పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం బారులు తీరారు. ఎంతమంది ఉన్నా.. కొందరు మాత్రం ఈస్పెషల్ అన్నట్లుగా.. తిరుమలకు సోమవారం వచ్చిన ప్రముఖుల్లో అత్యంత ప్రముఖుడన్నట్లుగా గౌరవ మర్యాదలు దక్కింది మాత్రం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ .. వారి కుటుంబ సభ్యులకు మాత్రమే.
తిరుమలకు వచ్చిన ఆయనకు అధికారులు బ్రహ్మరథం పట్టటం ఒక ఎత్తు అయితే.. చాలా అరుదైన దర్శనాన్ని కేటీఆర్ కు కలిగేలాచేశారని చెబుతున్నారు.  మిగిలిన ప్రముఖులకు భిన్నంగా కేటీఆర్.. ఆయన కుటుంబ సభ్యులకు పుష్కరిణి వైపు (బయో మెట్రిక్ నమోదు సెంటర్) నుంచి ఆలయంలోకి అనుమతించారు.
సాధారణంగా ఆరోగ్యపరమైన సమస్యలు అధికంగా ఉన్న వారిని మాత్రమే ఈ మార్గంలో అనుమతిస్తారు. ప్రముఖుల కోసం దీన్ని వినియోగించరు. కానీ.. అందుకు భిన్నంగా కేటీఆర్ కోసం ప్రత్యేక దర్శనాన్ని ఈ మార్గం నుంచి అనుమతించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మార్గం నుంచి కేటీఆర్ కు శ్రీవారి దర్శనాన్ని అధికారులు ఎందుకు కల్పించారన్న విషయం మీద ఎవరూ స్పష్టత ఇవ్వని పరిస్థితి.
మరోవైపు.. శ్రీవారి దర్శనానికి వచ్చిన మరో మంత్రి హరీశ్ రావుకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులు.. స్నేహితులతో కలిసి మొత్తం 13 దర్శన టికెట్లు కోరగా..కేవలం ఆరు మాత్రమే కేటాయించి టీటీడీ అధికారులు షాకిచ్చారు. దీంతో.. హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు అలిగి.. దర్శనానికి వెళ్లేందుకు సైతం నిరాకరించారు.
చివరకు తెలంగాణకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు దామోదర్ నచ్చజెప్పి ఆయనకు దర్శనానికి తీసుకెళ్లారు. అయితే.. తనకు ఎలాంటి అవమానం ఎదురుకాలేదని హరీశ్ మీడియాతో వ్యాఖ్యానించటం గమనార్హం. మరి.. అవమానం లాంటిదేమీ లేనప్పుడు టీటీడీ అధికారుల మీద కస్సుబుస్సు ఎందుకు ప్రదర్శించినట్లు హరీశా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.