జగన్ తో లోకేశ్ 75 కోట్లు కక్కించేలానే ఉన్నారే

September 24, 2020

ఏపీలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ వర్సెస్ వైసీపీ ఓ రేంజిలో సాగుతోంది. అప్పటిదాకా అధికార పార్టీగా ఉన్న టీడీపీ విపక్షంగా మారిపోగా... విపక్షంగా ఉన్న వైసీపీ అధికార పార్టీగా మారిపోయింది. ఈ క్రమంలో టీడీపీపై కక్షసాధింపు దిశగానే వైసీపీ వెళుతోందన్న వాదనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తన చేతిలోని సాక్షి పత్రికను ఆసరా చేసుకుని... టీడీపీ నేతలను ప్రత్యేకించి చంద్రబాబు, లోకేశ్ లను టార్గెట్ చేస్తున్న వైసీపీ... వారిపై అసత్య కథనాలను రాయిస్తోందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ కోవలోనే తనపై సాక్షి పత్రికలో అచ్చైన ఓ కథనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్ ఏకంగా కోర్టుకెక్కారు. కేవలం కోర్టుకెక్కి సాక్షితో సారీ చెప్పించుకునేందుకు మాత్రమే పరిమితం కాని లోకేశ్... తన పరువును దిగజార్చేలా వ్యవహరించిన సాక్షిపై ఏకంగా రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. పకడ్బందీగా లోకేశ్ సంధించిన ఈ పరువు నష్టం దావాలో జగన్... రూ75 కోట్లు కట్టక తప్పదా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

లోకేశ్ దాఖలు చేసిన పరువు నష్టం దావా వివరాల్లోకి వెళితే...  విశాఖ‌ప‌ట్నం 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టులో లోకేశ్ ఈ దావాను వేశారు. తన పరువుకు నష్టం కలిగించిన సాక్షి తనకు రూ.75 కోట్ల‌ మేర చెల్లించాలని ఆయన కోర్టును కోరారు. ఇష్టారాజ్యంగా రాతలు రాసి తన పరువుకు భంగం కలిగించారని లోకేశ్ ఈ దావా దాఖలు చేశారు. సాక్షి ప‌త్రిక‌లో 2019 అక్టోబ‌ర్ 22న ‘‘చిన‌బాబు చిరుతిండి 25 ల‌క్ష‌లండి’’ శీర్షిక‌తో ఓ కథనం ప్రచురితమైంది. ఆ క‌థ‌నంలో పేర్కొన్న అంశాలన్నీ పూర్తిగా అవాస్త‌వాలేన‌ని లోకేశ్ వాదిస్తున్నారు. సాక్షి పత్రిక సదరు కథనాన్ని దురుద్దేశపూరితంగా రాసిందని భావించిన లోకేశ్... సదరు కథనాన్ని ఖండిస్తూ 2019 అక్టోబ‌ర్ 25న సాక్షి సంపాద‌క‌బృందానికి  లీగల్ రిజిస్ట‌ర్ నోటీసు పంపించారు. దీనికి స్పందించిన సాక్షి పత్రిక కూడా 2019 నవంబర్ 10న సమాధానం ఇచ్చిందట. అయితే సదరు సమాధానంతో సంతృప్తి చెందని లోకేశ్... ఇప్పుడు నేరుగా కోర్టు మెట్లెక్కి సాక్షి పత్రికపై పరువు నష్టం దావా వేశారు. 

విశాఖ ఎయిర్ పోర్టులో తాను చిరుతిళ్లు తిన్నానని, ఆ చిరుతిళ్ల విలువ రూ.25 లక్షల విలువ అని సాక్షి పత్రిక కథనం రాసిందని పేర్కొన్న లోకేశ్... ఆ తేదీలలో తాను ఇతర ప్రాంతాల్లో పర్యటించానని పకడ్బందీ సాక్షాలు కూడా కోర్టుకు సమర్పించారు. కేవలం తన పరువును దిగజార్చి రాజకీయంగా లబ్ధి పొందేందుకే సాక్షి పత్రిక ఈ కథనాన్ని రాసిందని కూడా లోకేశ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యవహారంలో ముందుగా సాక్షి పత్రికకు నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత ఆ పత్రిక నుంచి వచ్చిన సమాధానాన్ని పరిశీలించిన తర్వాతే... కోర్టులో లోకేశ్ పరువు నష్టం దావా వేసిన నేపథ్యంలో ఆయన వాదన కరెక్టుగానే ఉందన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా తన వాదనకు బలం చేకూర్చేలా సాక్షాలను కూడా లోకేశ్ సమర్పించారని, ఈ కేసులో ఆయన విజయం సాధించడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా పకడ్బందీగానే కదులుతున్న లోకేశ్... జగన్ తో రూ.75 కోట్టు కక్కించి తీరతారన్న వాదనలూ ఆసక్తి రేపుతున్నాయి.