స్టైల్ మార్చిన లోకేష్

September 25, 2020

గ్రామస్తులతో భుజం భుజం కలిపి నడిచారు. వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందరినీ పేరుపేరునా పలకరించారు. వయసులో పెద్దావిడ ఆశీర్వచనం తీసుకున్నారు. ఆప్యాయంగా ఓ చిన్నారి నుదిటిన ముద్దాడారు. రాజకీయ ప్రత్యర్థులపై మాటల దాడి చేస్తూ, ట్విట్టర్ వేదిక మీదే ఎక్కువగా కనిపించే తెదేపా కీలక నేత, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్  ఇలా జనంతో మమేకమైన సందర్భాలు తక్కువ. చూస్తుంటే అయన తీరు మారిందా? క్రమంగా వ్యవహార శైలి మార్చుతున్నారా? అనిపించక మానదు.
ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినా గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పరాజయం పాలైంది.  స్థానిక నేతలపై జనాల్లో ఉన్న అసంతృప్తిని కనిపెట్టలేకపోయామనీ, సంక్షేమ పథకాల లబ్దిని క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకోలేకపోయామనీ ఇదే తమ ఓటమికి కారణమని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సన్నిహితుల దగ్గర పలుసార్లు వాపోయారు.

అదేసమయంలో జగన్ ఓదార్పుయాత్రతో జనానికి బాగా దగ్గరయ్యారు. వేల కిలోమీటర్లు తిరుగుతూ తాను గెలిస్తే ఏమేం చేస్తానో ప్రజలకు ప్రత్యక్షంగా వివరించారు. చిన్నాచితకా, ముసలీవయసు తేడా లేకుండా అందరినీ చొరవగా పలకరించారు. అంతకుముందు వైఎస్ మొదటిసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికీ పాదయాత్ర ఎంతో తోడ్పడింది. వీటన్నిటినీ గ్రహించాక పథకాలు, పాలనే కాదు ప్రజలకు దగ్గరగా ఉండటం ముఖ్యమని లోకేష్ గ్రహించినట్టున్నారు. ఈమధ్య తన సహజమైన ట్రెండ్ ని పూర్తిగా మార్చేశారు. అవకాశం వొచ్చిన ప్రతిసారీ జనానికి దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆయన జనంతో గెట్టిగా కరచాలనం, కావలించుకోవడం, చిన్నారులని ముద్దాడడం, తలపై ప్రేమగా నిమరడం.. మనకు సరికొత్త లోకేష్ ని పరిచయం చేస్తున్నాయి.

ఈమధ్య తన నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ప్రత్యేక పూజ, గ్రామకమిటీ సమావేశాల్లో పాల్గొన్నారు. సమస్యలపై చర్చిస్తూ అందరితో కలిసిపోయారు.  అంతకుముందు అనారోగ్యం పాలైన ఒక సామాన్య కార్యకర్త ఇంటికి స్వయంగా వెళ్లి పలకరించారు.  ఎవరికీ ఏ సమస్య వచ్చ్చినా తనను సంప్రదించాలంటూ పదేపదే చెబుతున్నారు. ఎన్నికల గోదాలో, రాజకీయ క్షేత్రంలో గెలవాలంటే ముందు ప్రజల మనసులు గెలుచుకోవాలనే నిర్ణయానికి ఆయన వోచ్చ్చినట్టు అనిపిస్తోంది. అది వైఎస్ ట్రేడ్ మార్కా? జగన్ స్టైల్ నా అన్నది పట్టించుకోకుండా జనంలోకి చొచ్చుకెళ్లిపోతున్నారు. అందుకే మేడలు వదిలి జనం నాడీ  పట్టుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు.