సంచలనం: ఎల్వీ బదిలీ.. క్రైస్తవ, దళిత వర్గాల విజయమట

September 24, 2020

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన ఎల్వీ... బహిరంగంగానే వైసీీపీకి మద్దతుగా, టీడీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన విషయం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఎక్కడికక్కడ కట్టడి చేసేలా ఎల్వీ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగానే మారిన సంగతీ తెలిసిందే. జగన్ కు దగ్గరయ్యేందుకు టీడీపీపై కక్ష పెంచుకున్న ఎల్వీ... ఓ అధికారిగా కాకుండా ఓ రాజకీయ నేతగా వ్యవహరించారన్న విమర్శలూ లేకపోలేదు. అయితే ఎవరు తీసుకున్న గోతిలో పడతారన్న చందంగా... చంద్రబాబును వ్యతిరేకిస్తే... జగన్ కు దగ్గరవుతానన్న భ్రమతో సాగిన ఎల్వీపై ఇప్పుడు ఆకస్మిక బదిలీ వేటు పడింది. 

ఎల్వీ బదిలీకి ఇవే కారణాలంటూ పలు సంఘాలు పలు రకాలుగా విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో... క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి,  ఆలిండియా దళిత, క్రైస్తవ సంఘాల సమాఖ్య లు సంయుక్తంగా ఓ సంచలన ప్రకటనను విడుదల చేశాయి. ఎల్వీని బదిలీ చేసినందుకు ఆ సంస్థలు ఏకంగా సీఎం జగన్ తో పాటు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ప్రత్యేకంగా కృతజ్ఝతలు చెబుతూ వెలువరించిన ఈ ప్రకటన ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతలా ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ప్రకటనను ఆ సంస్థల పేరిట విడుదల చేసిన వ్యక్తి మరింతగా ఆసక్తి రేకెత్తిస్తున్నారని చెప్పక తప్పదు. ఆ వ్యక్తి ఎవరంటే... ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరించిన జెరూసలేం మత్తయ్యే.  క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితిని ఏర్పాటు చేయడంతో పాటుగా ఆలిండియా దళిత, క్రైస్తవ సంఘాల సమాఖ్య పేరిట మరో సంఘాన్ని కూడా నడుపుతున్న మత్తయ్య... ఈ ప్రకటన విడుదల చేయడం నిజంగానే ఆసక్తికరమే. 

ఎల్వీ బదిలీతో జగన్ కు మత్తయ్య స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం ఓ సంచలనమైతే... అసలు ఎల్వీని జగన్ సర్కారు ఎందుకు బదిలీ చేసిందన్న కారణాలను కూడా మత్తయ్య సదరు లేఖలో ప్రస్తావించి మరింత కలకలం రేపారు. సీఎస్ గా ఎల్వీ పదవీ బాధ్యతలు స్వీకరించడం, ఆ తర్వాత జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో... ఎల్వీ మరింతగా రెచ్చిపోయారట. హిందూ ధర్మ పరిరక్షణ పేరిట దేవాదాయ శాఖలో పనిచేస్తున్న దళితులను ఉద్యోగాల్లో నుంచి పీకేయడంతో పాటుగా వారిని నానా వేధింపులకు గురి చేసే ఓ కార్యక్రమాన్ని ఎల్వీ చేపట్టారట. ఎల్వీ చర్యలతో దేవాదాయ శాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న దళితులు నానా ఇబ్బందులు పడటంతో పాటుగా ఉద్యోగాలను కూడా వదిలేయక తప్పలేదట. ఈ కారణంగానే దళితులు నేరుగా సీఎంను మొరపెట్టుకున్నారని, వారి ఆవేదనను విన్న తర్వాతే ఎల్వీని జగన్ బదిలీ చేశారని కూడా మత్తయ్య సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్వీ బదిలీ వ్యవహారాన్ని దళిత, క్రైస్తవుల విజయంగా మత్తయ్య అభివర్ణించారు. అంతటితో ఆగని మత్తయ్య... ఎల్వీ బదిలీ కాగానే... ఆయనను బదిలీ చేయించింది తామేనన్న ధీమాతో ఓ పెద్ద విజయం సాధించామన్న రీతిలో సంబరాలు చేసుకున్నారట. అంతేకాదండోయ్... ఎల్వీ బదిలీని కేక్ కటింగ్ తో మత్తయ్య పండుగ చేసుకున్నారట.