క్లైమాక్స్: ‘మహా’ డ్రామాకు ఈ రోజే ముగింపు

September 22, 2020

ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా.. అధికారాన్ని పంచుకునే విషయంలో తేడా వచ్చి.. వాటా పంచాయితీతో ప్రజాధనం దుర్వినియోగం అయ్యేలా వ్యవహరించిందన్న నింద మీద పడేలా వ్యవహరిస్తోంది శివసేన. మిత్రపక్షంతో ఎన్నికల్లో పోటీ చేసి.. తీరా ఫలితాలు వచ్చాక పవర్ ను సమానంగా పంచుకోవాలన్న వాదనను తెర మీదకు తీసుకొచ్చిన సేన తీరుపై మహారాష్ట్ర ప్రజలు సైతం సానుకూలంగా లేరన్న మాట వినిపిస్తోంది.
ప్రజల మూడ్ ను గుర్తించిన బీజేపీ తెలివిగా.. అధికారం కోసం పాకులాడకుండా ఉందన్న మాట వినిపిస్తోంది. అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ కోరినా.. తమకు తగిన బలం లేదని ఒద్దికగా చెప్పి బరి నుంచి తప్పుకున్న వైనంతో సానుభూతి బీజేపీ మీద మరింత పెరిగినట్లు చెబుతున్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ శివసేనకు గవర్నర్ నుంచి ఆఫర్ వచ్చినంతనే.. ఆ పార్టీ పరుగులు తీసిన వైనం.. పడిన హడావుడి చిన్నపిల్లాడు చాక్లెట్  కోసం పడే తపనలా ఉందన్న భావన కలిగేలా సేన అధినాయకత్వం వ్యవహరించింది. బీజేపీ గేమ్ ప్లాన్ ను సరిగా అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయిన సేన.. కాంగ్రెస్.. ఎన్సీపీలు తనకు దన్నుగా నిలుస్తాయన్న అత్యాశతో పవర్ తీసుకునేందుకు ముందుకొచ్చి భంగపడింది.
ఈ రోజు రాత్రి 8.30 లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలాన్ని చూపించాల్సిందిగా ఎన్సీపీని కోరారు మహారాష్ట్ర గవర్నర్. దీంతో.. ఇంతకాలం సాగిన మహా డ్రామా ముగింపునకు రావటమేకాదు.. ఈ రాత్రికి ఫలితం తేలటం ఖాయమంటున్నారు. తమకు బలం లేదని ఎన్సీపీ చేతులు ఎత్తేసే అవకాశమే ఎక్కవని.. అది జరిగిన వెంటనే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితికి శివసేనే కారణమన్న భావన మరాఠా ప్రజలకు కలిగేలా చేయటంలో బీజేపీ సక్సెస్ అయ్యిందన్నమాట వినిపిస్తోంది. ఏమైనా.. ఈ రాత్రికి లెక్కలు తేలిపోవటం ఖాయమని చెప్పక తప్పదు.