జ‌గ‌న్ నీతి వాక్యాలకు శుభం కార్డు పడింది

September 24, 2020

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చెప్పే ఆద‌ర్శ రాజ‌కీయాల నీతులు కొంద‌రికే వ‌ర్తిస్తాయా? త‌ను అనుకుంటే...త‌న మాట‌నే తాను తుంగ‌లో తొక్క‌గ‌ల‌రా?  ప్ర‌ధానంగా...ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడును దెబ్బ‌కొట్టాల‌నుకున్నప్పుడు...జ‌గ‌న్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తారా? ఇది ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ చేసిన వ్యాఖ్య‌లే దీనికి కారణం. ఇంత‌కీ వంశీ ఏమ‌న్నారంటే...``తెదేపా ఎమ్మెల్యేగా ఉండి.... వైకాపాకు మద్దతిస్తున్నా- దీని ద్వారా ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా నేను ఎదుర్కొంటా- అవసరమైతే పదవికి రాజీనామా చేస్తా``అని ప్ర‌క‌టించారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన వంశీ....` వైకాపాకు మద్దతిస్తా... జగన్ తో కలిసి నడుస్తా. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.`` అని ప్ర‌క‌టించారు. ``వారసత్వ రాజకీయాలు నాకు అవసరం లేదు. తెదేపా ఎమ్మెల్యేగా ఉండి.... వైకాపాకు మద్దతిస్తున్నాను. దీని ద్వారా ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా నేను ఎదుర్కొంటా. అవసరమైతే పదవికి రాజీనామా చేస్తా. కొత్త ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన కూడా పోలేదు. ఏ ప్రభుత్వానికి అయిన కొంత సమయం ఇవ్వాలి. అయిన‌ప్ప‌టికీ...చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్రజలు మెచ్చి గెలిపించిన నాయకుడికి మద్దతివ్వల్సిన అవసరం ఉంది`అని వైసీపీకి మ‌ద్ద‌తుపై త‌న అభిప్రాయాన్ని వ‌ల్ల‌భ‌నేని వంశీ క్లారిటీ ఇచ్చారు.
అభిప్రాయాలు ఎవరికైనా మారుతాయని తన నిర్ణ‌యాన్ని వంశీ స‌మ‌ర్థించుకున్నారు. `స్థానిక నాయకులతో కలిసి మాట్లాడాక నిర్ణయం మార్చుకున్నాను. మంచి పనులు చేస్తే వైకాపాకు మద్దతిస్తాం. లేదంటే దానికీ దూరంగా ఉంటాం``అని ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి జగన్‌కు మద్దతిస్తే త‌నకు ఎలాంటి ప్రయోజనం లేదని, కేసులు కొత్త కాదని వంశీ  వెల్ల‌డించారు.  `తెదేపాలో ఉన్నప్పుడే నాపై కేసులు పెట్టారు. కేసులకు నేను భయపడను. తప్పుడు కేసులు పెట్టిన వారిని ఎదుర్కొంటాను.  అయితే, వంశీ చెప్తున్న‌ట్లు...అలా ప‌ద‌వికి `అవ‌స‌ర‌మైతే` రాజీనామా చేసే వంశీ మ‌ద్ద‌తును జ‌గ‌న్ తీసుకుంటారా? అలాగైతే...ఆయ‌న చెప్పిన ఆద‌ర్శ రాజ‌కీయాల సంగ‌తేంటి?  త‌న‌కు మ‌ద్ద‌తిచ్చే వారు ప‌ద‌వికి గుడ్‌బై చెప్పాల‌ని పెట్టిన ష‌ర‌తును ఎందుకు వంశీ విష‌యంలో స‌డ‌లించారు? ఇవ‌న్నీ..శేష ప్ర‌శ్న‌లే కాదు జ‌గ‌న్‌పై అనుమానం రేకెత్తించే అంశాలు కూడా.