అమ్మో! సోమవారం.. కేసీఆర్‌లో మొదలైన టెన్షన్

September 22, 2020

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపటి సోమవారాన్ని తలచుకుని కంగారుపడుతున్నారట. అందుకు కారణం ఉందంటున్నారు బీజేపీ, వామపక్ష నాయకులు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండడంతో అక్కడ ఆర్టీసీ సంక్షోభం చర్చకు వస్తుందని.. తన ఇబ్బంది తప్పదని కేసీఆర్ టెన్షన్ పడుతున్నారని చెబుతున్నారు.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె, కార్మికుల పట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై పార్లమెంటులో లేవనెత్తుతామని సీపీఐ ఇప్పటికే ప్రకటించింది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బినయ్ విశ్వం ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చకు పెడతామని చెప్పారు. సమ్మెను తెలంగాణ ప్రభుత్వం ఆటవికంగా అణచివేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. న్యాయమైన డిమండ్ల కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను సీపీఐ , ఎఐటీయూసీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. నిరవధిక దీక్షలో ఉండగా పోలీసులు ఆర్టీసీ జాక్ కో కన్వీనర్ కే రాజిరెడ్డిని అరెస్టు చేశారని తెలుసుకున్న విశ్వం పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి పరామర్ళించారు. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ నిధులను దారిమళ్లించారని , ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని.. ఇవన్నీ పార్లమెంటు ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
మరోవైపు బీజేపీ కూడా ఆర్టీసీ ఇష్యూపై పార్లమెంటులో చర్చించడానికి రెడీ అవుతోంది. ఆర్టీసీ కార్మికులతో పాటు ఓ నిరసనలో పాల్గొన్నప్పుడు బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీనిపై ఆయన లోక్ సభ స్పీకరుకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీంతో బీజేపీ కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఆర్టీసీలో తమకు వాటా ఉందని కేంద్రం చెబుతుండడం.. పార్లమెంటులో ఇది ప్రస్తావనకొస్తే కేంద్రం ఎలా స్పందిస్తుందో.. ఏం చేస్తుందో అని కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీ నాయకుల నుంచి వినిపిస్తోంది.