ఇద్దరికీ సమాన ఓట్లు వస్తే ఏం చేశారంటే...

September 22, 2020

ఎన్నికల్లో విజేతను ఎలా డిసైడ్ చేస్తారు? ఇదేం పిచ్చి ప్రశ్న అని తొందరపడొద్దు. ఎందుకంటే.. ఇప్పుడు చెప్పే విషయం తెలిస్తే అవాక్కు అవుతారు. సాధారణంగా పోలింగ్ పద్దతిలో ఓట్ల మెజార్టీ ఎంతన్నది చూసి విజేతను ఫైనల్ చేస్తారు. అయితే.. సమానమైన ఓట్లు వస్తే.. టాస్ వేసి విజేత ఎవరో నిర్ణయిస్తారు. ఇందుకు భిన్నంగా విజేతను ఎంపిక  చేసిన వైనం ఆసక్తికరంగానే కాదు.. అందరూ మాట్లాడుకునేలా చేసింది.
హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతమైన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కొంపల్లి మున్సిపాలిటీకి జరిగిన పుర ఎన్నికల్లో ఈ సిత్రం చోటు చేసుకుంది. మూడో వార్డు ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి సన్న శ్రీశైలం యాదవ్.. బీజేపీ అభ్యర్థి ఆదిరెడ్డి మోహన్ రెడ్డి ఇద్దరికి సమానంగా 356 ఓట్లు వచ్చాయి. విజేత ఎవరో తేల్చటం పెద్ద సమస్యగా మారింది.
ఇలాంటివేళ.. ఒక ఓటుకు కారు గుర్తుకు.. కమలం గుర్తుకు మధ్యలో ఓటు ముద్ర పడింది. దీంతో.. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ ముద్రను స్కేల్ తో కొలిచి చూశారు. అది ఎక్కువ శాతం కారు గుర్తు వైపు ఉండటంతో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీశైలం యాదవ్ ను ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందినట్లుగా ప్రకటించారు. స్కేల్ తో కొలిచి విజేతను డిసైడ్ చేసిన తీరు ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.