చిరు కోసం తన రూల్ ను ఛేంజ్ చేసుకోని నయన్

September 26, 2020

హీరోయిన్లు చాలామంది ఉంటారు. కానీ.. చాలా తక్కువమంది మాత్రం కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా ఉంటారు. అదెంత పెద్ద బ్యానర్ అయినా.. ఎంత పెద్ద నటులైనా.. ఎంత పెద్ద సినిమా అయినా.. తాను పెట్టుకున్న రూల్ నుంచి పక్కకు తప్పుకోవటానికి ఇష్టపడరు. అలాంటి వారి విషయానికి వస్తే.. బహుభాషా నటి నయనతార పేరును ముందుగా చెప్పుకోవాలి.
కెరీర్ ఆరంభం నుంచి ఆమె పెట్టుకున్న రూల్ వింటే అవాక్కు అవ్వాల్సిందే. తాను నటించే సినిమా ఏదైనా సరే.. దాని ప్రచార కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటారు. తన సినిమాను ప్రచారం చేసుకునేందుకు ఆమె ససేమిరా అంటారు. సినిమాను ఒప్పుకునే ముందు.. దర్శక నిర్మాతలతో ఆమె చాలా స్పష్టంగా తాను మూవీ ప్రమోషన్ వర్క్ లో పార్టిసిపేట్ చేయనని స్పష్టం చేసేస్తుంటారు.
ఎంత పెద్ద సినిమా అయినా ఆమె రూల్ నుంచి పక్కకు తప్పుకున్నది లేదు. తాజాగా చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రంలో నయన్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమా కావటం.. చిరంజీవి హీరోగా చేస్తున్న మూవీకి రాంచరణ్ నిర్మాత కావటంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి.
ప్రత్యేకపరిస్థితుల కారణంగా ఈ సినిమా విషయంలో నయన తార తన రూల్స్ ను ఛేంజ్ చేసుకునే అవకాశం ఉందన్న మాట పలువురి నోట వినిపించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె.. తన రూల్ ను మార్చుకోనని స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తోంది.
తన గత సినిమాల మాదిరే.. సైరా సినిమాకు సైతం తాను ప్రమోషన్ వర్క్ లో పాల్గొనని స్పష్టం చేసినట్లుగా సమాచారం. అదే నిజమైతే.. నయనతారకు హేట్సాఫ్ చెప్పాల్సిందే. కావాలంటే మరో కోటి ఎక్కువ ఇస్తాం.. ఇలా చేస్తారా? అలా చేస్తారా? అని ఊరించే వారి మాటలకు పడిపోకుండా.. తాను నమ్మిన దానికి కట్టుబడి ఉండటం మామూలు విషయం కాదు.