వైసీపీ గాసిప్ లకు టీడీపీ బిగ్ బ్రేక్

September 21, 2020

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీస్తున్న త‌రుణంలో..సొంత చ‌రిష్మా గెలుపొందిన ఓ ఎమ్మెల్యే..తెలుగుదేశం పార్టీకి షాక్ ఇవ్వ‌నున్నార‌నే ప్ర‌చారానికి బ్రేక్ ప‌డింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసినా ప్రకాశం జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, చీరాల నుండి కరణం బలరామ్, పర్చూరు నుండి ఏలూరి సాంబశివరావు, కొండపి నుండి బాలవీరాంజనేయస్వామి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ న‌లుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై గత రెండు నెలలుగా వైసీపీ దృష్టిసారించి వైసీపీలోకి రావాలంటూ ఎమ్మెల్యేలతో జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు జరుపుతున్నారని, మ‌రోమంత్రి కొడాలి నాని సైతం రంగంలోకి దిగార‌ని వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. అయితే, దీనిపై తాజాగా క‌ర‌ణం క్లారిటీ ఇచ్చారు. తెదేపాను వీడే ప్రసక్తేలేదని బలరాం తేల్చిచెప్పారు.
ప్ర‌కాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంతో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఆయ‌న పార్టీ మారేందుకు సుముఖ‌త తెలుప‌క‌పోవ‌డంతో...మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని టచ్‌లో ఉన్నట్టు వార్త‌లు వ‌చ్చాయి. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులే హడావిడి చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లుగా ఉన్న వాళ్లే ఎమ్మెల్యేలుగా పెత్తనం చెలాయిస్తున్నారు. టీడీపీకి రాజీనామా చేసి వస్తే వైసీపీలో నియోజక వర్గ ఇన్ ఛార్జ్ పదవులు ఇస్తా మంటూ మంత్రులు ఆఫర్ ఇవ్వ‌డంతో...వైసీపీలో చేరేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు సముఖంగా ఉన్నట్టు ప్ర‌చారం జ‌రిగింది.
దీనికి తాజాగా,  ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పేస్‌బుక్‌ వేదికగా స్పందించారు. తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని కరణం బలరాం స్పష్టం చేశారు. బెదిరిస్తే పార్టీ మారడానికి తమకు రాళ్ల వ్యాపారం, ఇసుక వ్యాపారం లేదని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. పార్టీ మారాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కొందరు వైకాపాలో చేరుతారనే ప్రచారంలో కూడా వాస్త‌వం లేద‌ని..ఆయ‌న ప్ర‌క‌టించారు.