సంక్రాంతికి అందని జీతం

September 25, 2020

సంక్రాంతికి అందని జీతం
ప్రభుత్వోద్యోగులకు నెలనెలా గండం
అమ్మఒడికి తరలిస్తున్నారని ఆగ్రహం
ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు వేతనాలతో ముడి


రూ.20 వేల కోట్ల భారీ రెవెన్యూలోటు ఉన్న గత ఐదేళ్లలో ప్రభుత్వోద్యోగులకు ఏనాడూ జీతాల చెల్లింపు ఆలస్యం కాలేదు. కచ్చితంగా ఒకటో తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకల్లా వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమైనట్లు వారికి ఫోన్లలో మెసేజ్‌ వచ్చేసేది. అయునా నాటి సీఎం చంద్రబాబును వారు వ్యతిరేకించారు. కొన్ని శాఖల్లో పైలట్‌ ప్రాజెక్టుగా బయోమెట్రిక్‌ విధానం ప్రవేశపెడతామనేటప్పటికి ఆయనపై అక్కసు పెంచుకున్నారు. సమయానికి ఆఫీసుకు రమ్మని కోరడమే ఆయన చేసిన నేరం. ఫ్రెండ్లీ జగన్‌ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకున్నారు. మే నెల వరకు ఆర్థిక శాఖలో పాత అధికారులే ఉండడంతో జూన్‌ 1నే జీతాలు పడ్డాయి. జూలై, ఆగస్టులో ఐదు, ఏడు రోజులు ఆలస్యంగా పడ్డాయి. ఇక సెప్టెంబరులో అయితే నెలపొడవునా ఒక్కో శాఖకు ఒక్కో రోజు చొప్పున వేస్తూ వచ్చారు. అయితే ఏ శాఖకు ఎప్పుడ వేతనాలిచ్చేదీ స్పష్టత ఇచ్చే నాథుడే లేడు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. కొత్త సంవత్సరంలోనైనా త్వరగా వస్తాయని ఉద్యోగులు గంపెడాశ పెట్టుకున్నారు. కానీ సంక్రాంతికి కూడా చాలా శాఖలకు అందలేదు. సచివాలయ స్థాయిలో రెగ్యులర్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ వేతనాలు అందినా కార్పొరేషన్లు, హెచవోడీ ఉద్యోగులు, కొందరు టీచర్లకు డిసెంబరు నెల జీతాలు ఇంకా జమకాలేదు. ఈ జాబితాలో సెర్ప్‌, పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌, సర్వే డైరెక్టరేట్‌, ఎస్సీ కార్పొరేషన ఇంకా ఇతర కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. కొన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో సగం మందికే వేతనాలు అందాయి. దీంతో వేతనాల కోసం ఆయా కార్యాలయాల ఉద్యోగులు ఆర్థిక శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పదో తేదీ వచ్చినా ఇంకా వేతనాలు పడకపోవడంపై ఆ శాఖ గంటకో కారణం చెబుతోంది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌)లో బిల్లులు అప్‌లోడ్‌ చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నా ఉద్యోగులు నమ్మడం లేదు. అమ్మఒడి అమలుకు ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని.. తమ వేతనాల సొమ్మును అటు మళ్లించారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు పంచడం కోసం తమకు వేతనాలు ఆపేస్తారా అని నిలదీస్తున్నారు. సాధారణంగా ప్రతి నెలా వేతనాలు, పెన్షన్లు కలిపి రూ.5,600 కోట్ల వరకు ప్రభుత్వానికి ఖర్చవుతుంది. ఇందులో జనవరి ఒకటి రెండు తేదీల్లో దాదాపు రూ.3,000 కోట్లు వరకు మాత్రమే ఆర్థిక శాఖ విడుదల చేసింది. మిగిలిన డబ్బును భోగి రోజు (14న) విడుదల చేస్తానని చెప్పింది. బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పు తెచ్చుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఆర్‌బీఐ ద్వారా బాండ్లను వేలం వేసి నిధులు సమీకరించి వాటిని మిగిలిన ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామంటున్నారు. నెలనెలా ఏదో సాకుతో తమను వేధిస్తున్నారని వారు వాపోతున్నారు.


ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టువారికే మొదటి చాన్సు
నిజానికి కొందరు ప్రభుత్వోద్యోగులకే ఒకటో తేదీన వేతనాలు అందుతాయని ఆర్థిక శాఖ అధికారులు ముందుగానే చెప్పారు. తమ శాఖలోని ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు అందాకే తాను వేతనం తీసుకుంటానని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ గతంలో తన డీడీవోకు లేఖ రాశారు. మరో ఇద్దరు ఐఏఎస్‌లూ ఇదే చేశారు. దీంతో ముందుగా ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల బిల్లులు అప్‌లోడ్‌ చేసిన తర్వాతే రెగ్యులర్‌ ప్రభుత్వోద్యోగుల వేతనాల బిల్లులను డీడీవోలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల బిల్లుల అప్‌లోడింగ్‌లో సమస్యలు ఎదురవుతున్నాయని, దీంతో రెగ్యులర్‌ ఉద్యోగుల బిల్లులు ఆలస్యమవుతున్నాయని అంటున్నారు. కానీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలతో తమ వేతనాలు ముడిపెట్టడమేంటని కొందరు రెగ్యులర్‌ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు.