నిర్మలమ్మకు ఎంత కష్టమొచ్చింది

September 25, 2020

భారత ఆర్ధిక వ్యవస్థ విషయంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ప్ర‌భాక‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ప్రస్తుతం విప‌క్షాల‌కు వ‌రం కావ‌డంతో పాటు మీడియాలోనూ బాగా హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని అభిప్రాయపడ్డ పరకాల... దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పీవీ నరసింహారావు-మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలను ప్రధాని మోడీ అనుసరించాలని వ్యాఖ్యానించారు.
అయితే మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నా కూడా ఇంకా తిరస్కరణ ధోరణిలోనే వెళ్తోందన్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం వాస్తవాలని అంగీకరించడం లేదని తెలిపారు. అలాగే నెహ్రూ ఆర్థిక విధానాలను విమర్శించడం తప్ప బీజేపీకి సొంత విధానమంటూ లేదని మండిపడ్డారు. అధికార పార్టీ చర్య ఆర్థిక విమర్శగా లేదని రాజకీయ దాడిగానే మిగిలిపోయిందని, ఆ విషయాన్ని ఆ పార్టీ ఇంకా గుర్తించడం లేదని పేర్కొన్నారు.
దేశంలో డిమాండ్ గణనీయంగా తగ్గిపోయిందని, వాహన అమ్మకాలు 11 నెలలుగా పడిపోతూనే వస్తున్నాయని, నిరుద్యోగిత 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుందని చెప్పారు. ఐఎంఎఫ్ కూడా ఆర్థిక వృద్ధి రేటును 6.9 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిందని, దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా బీజేపీ కేంద్ర మంత్రులు దేశంలో అంతా సక్రమంగా ఉందని చెప్పడం విచారకరమని అన్నారు.
ఇదిలా ఉంటే భర్త పరకాల వ్యాఖ్యలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు మౌలిక సంస్కరణల్ని చేపట్టింది మోదీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అలాగే జీఎస్టీ, ఆధార్‌, వంట గ్యాస్‌ పంపిణీ వంటి చర్యల్నీ చేపట్టింది కూడా మోదీ ప్రభుత్వమేనని తెలిపారు. నిర్మ‌ల భ‌ర్త వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇవ్వం వెన‌క బీజేపీ పెద్ద‌ల ఒత్తిడి ఉంద‌ని కూడా తెలుస్తోంది.